ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తాం : మంత్రి లోకేష్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతాం
ఇందుకు మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి
మంగళగిరిలో తల్లికి వందనం లబ్ధిదారులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
మంగళగిరి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరి బైపాస్ కొండపనేని టౌన్ షిప్ పార్క్ లో మంత్రి లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతోందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషిచేస్తున్నాం. గతంలో ప్రైవేటు పాఠశాలలను చూసి అసూయపడేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను చూసి ప్రైవేటు పాఠశాలలు అసూయపడేలా చేస్తాం. నిడమర్రు పాఠశాలలో ప్రవేశాల కోసం విపరీతమైన పోటీ ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం విద్య. సమాజంలో మార్పునకు, రాష్ట్ర అభివృద్ధికి విద్యే ప్రధానం. ప్రజాప్రభుత్వంలో 16వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. ఈ ఏడాది మరో 3వేల పోస్టులు భర్తీ చేస్తాం. పదివేలకు పైగా పాఠశాలల్లో వన్ క్లాస్-వన్ టీచర్ విధానం తీసుకువచ్చాం. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివచ్చారని మంత్రి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై ఆరా
ప్రభుత్వ పాఠశాలల పనితీరు, బోధన గురించి మహిళలను మంత్రి ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం అందరికీ అందుతుందా అని ఆరా తీశారు. అందరికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని మహిళలు వివరించారు. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా అందరితో పాటు లబ్ధి చేకూర్చేలా తల్లికి వందనం పథకం జులైలో అమలుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా ఆర్థిక సాయం నిధులు తల్లుల ఖాతాల్లో జమఅవుతాయని వివరించారు. యువగళం పాదయాత్ర సమయంలో విద్యలో కర్నూలు వెనుకబడి ఉండటాన్ని గమనించానని, ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం అందించాలని అప్పుడే సంకల్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు మగ పిల్లలకు కూడా బ్యాడ్ టచ్ గురించి తరగతి గదిలో బోధించాలని, విద్యాసంవత్సరం పూర్తైన తర్వాత పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లు నిర్వహించాలని కోరారు. ఇందుకు చర్యలు తీసుకుంటామని, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లకు లైబ్రరీలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. తల్లికి వందనం పథకం కింద అందే ఆర్థికసాయాన్ని పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేస్తున్నట్లు మహిళలు వివరించారు.
మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి
విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు గారితో నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి విద్యార్థులకు అందజేశాం. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను అందరూ గౌరవించాలి. టెక్నాలజీ వల్ల మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మనం ఏది ఎంచుకున్నామనేది ముఖ్యం. ప్రతి కుటుంబం ఏఐ వినియోగించి నేర్చుకోవాలనేది సీఎం చంద్రబాబు గారి ఆలోచన.
మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
మంగళగిరిలో 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరాను. ప్రజలు 91వేల భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. మంగళగిరికి పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే మొదటి విడతలో 3వేల ఇళ్ల పట్టాలు అందజేశాం. రెండో విడతలో మరో 3 వేల పట్టాలు అందిస్తున్నాం. నియోజకవర్గంలో పదివేల ఇళ్లు నిర్మిస్తాం అని లోకేష్ పేర్కొన్నారు.








