అందరికీ ఓపీఎస్ వచ్చేలా కృషి : పల్లా శ్రీనివాసరావు
ఏళ్లనాటి ఉద్యోగ, ఉపాధ్యాయుల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని, అందరికీ ఓపీఎస్ (OPS) వర్తించేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను సీపీఎస్ (CPS) నుంచి ఓపీఎస్కు మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు విశాఖ నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కృతజ్ఞతాభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు హాజరైన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు సక్రమంగా నడవాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువకావాలన్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగుల (Employees) సంక్షేమంపై దృష్టిసారిస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లవచ్చనే విశ్వాసం కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియని, పనులు నిత్యం సాగాలన్నా, భవిష్యత్తు తరాలకు ఉత్తమ ఫలితాలు అందాలన్నా తరచూ ప్రభుత్వాలు మారకూడదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉత్తమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు కొనసాగాలని కోరారు.








