ఆధారాలు చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి (Galla Madhaviడిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆధారాలు చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గుంటూరు (Guntur)లో మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో (video) పూర్తిగా కల్పిత కథనమని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసుల ( police)ను ఆదేశించామని అన్నారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.








