పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలివే…
పార్లమెంట్ వర్షారంభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రతిపక్షాలు లేవదీసే అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సంకల్పించింది. మరో వైపు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని పలు అంశాలపై సభలో గట్టిగానే నిలదీయాలని డిసైడ్ అయ్యాయి.
రామ మందిర విరాళాల చోరీ విషయంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే మణిపూర్ గొడవలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ లాంటి అంశాలను సభలో లేవదీయాలని నిర్ణయించారు. దేశం అనేక ఇతర సున్నితమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వం కేవలం తమ బిల్లులను ఆమోదించుకోవడంపైనే ఆసక్తి చూపిస్తోందని కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది.
మరో వైపు సమాజ్ వాదీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన విషయంపై నిలదీయాలని నిర్ణయించింది. అఖిల పక్ష భేటీలో కాంగ్రెస్ వైఖరిని సమర్థించింది సమాజ్ వాదీ. అలాగే నీట్ ప్రశ్నా పత్రం లీకేజీ, జంతర్ మంతర్ వద్ద దీక్ష విషయంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ప్రభుత్వం వీటికి సమాధానం ఇవ్వాల్సిందేనని, తప్పించుకోలేదని ఎంపీలు పేర్కొంటున్నారు.
ఇక.. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యాయి. బహిష్కృత ఎంపీల విషయాన్ని, బెంగాల్ సంఘటనలపై అంశాన్ని లేవనెత్తాలని తృణమూల్ భావిస్తుండగా… తమ పార్టీకి చెందిన ఎంపీలను షిండే వర్గీయులుగా గుర్తించిన అంశంపై శివసేన యూబీటీ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.








