మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Seetaram) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన ఒక భారీ భూకబ్జా మరియు నకిలీ పత్రాల సృష్టి కేసులో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తమ్మినేని సీతారాం అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు చేసిన కుట్ర సంచలనంగా మారింది. బతికున్న అసలు భూ యజమాని చనిపోయినట్లుగా తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ పత్రాలను సృష్టించారు.
తద్వారా సుమారు రూ. 4 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన స్థలాన్ని అక్రమంగా తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్‌లో మొత్తం 13 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఏ-6 గా, ఆయన కుమారుడు తమ్మినేని నానిని ఏ-5గా, అలాగే ఆయన భార్య తమ్మినేని వాణిని ఏ-7గా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కుట్రకు సంబంధించి పోలీసులు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, కీలక సూత్రధారులతో పాటు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు మిగిలిన నిందితులపై చర్యలు వేగవంతం చేశారు. బతికున్న యజమానిని కాదని ప్రభుత్వ రికార్డులను సైతం తారుమారు చేసిన తీరుపై రెవెన్యూ అధికారుల పాత్రపైనా విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులైన తమ్మినేని సీతారాం మరియు ఆయన భార్యాపుత్రులను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని జిల్లా పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసినట్లు సమాచారం.








