ఆ ఆరుగురూ షిండే వర్గీయులే… ఉద్ధవ్ థాకరేకి షాక్
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఆరుగురు అసమ్మతి ఎంపీల విలీనాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తించారు. ఈ నిర్ణయం ద్వారా, ఆ ఆరుగురు ఎంపీలను లోక్సభలో షిండే వర్గం సభ్యులుగా అధికారికంగా గుర్తించినట్లయింది.
ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, షిండే నేతృత్వంలోని శివసేనలో తమ విలీనానికి ఆమోదం కోరుతూ లోక్సభ సచివాలయానికి దరఖాస్తు సమర్పించిన తర్వాత ఈ గుర్తింపు లభించింది. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఆ అభ్యర్థనను అంగీకరించి, దిగువ సభలో ఈ పరిణామానికి అధికారిక గుర్తింపునిచ్చింది.
అయితే.. స్పీకర్ నిర్ణయంతో ఈ ఆరుగురు ఎంపీలు సంజయ్ జాదవ్, ఓం ప్రకాష్ రాజేనింబాల్కర్, సంజయ్ దిన పాటిల్, సంజయ్ దేశముఖ్, నగేష్ పాటిల్, అస్తికర్ ఇప్పటి నుంచి షిండే వర్గీయులుగా గుర్తింపు పొందారు.స్పీకర్ ఆమోదంతో, షిండే నేతృత్వంలోని శివసేనలో వారి విలీనం ఇప్పుడు లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందింది.
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని వర్గాన్ని వీడి, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో ఆరుగురు పార్లమెంటు సభ్యులు చేరిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. వారి చేరికతో లోక్సభలో షిండే వర్గం బలం 13 మంది ఎంపీలకు పెరిగింది.








