రైల్వే చరిత్రలో నూతన అధ్యాయం.. హైడ్రోజన్ రైలు ప్రారంభం.. ప్రత్యేకతలివే..
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆత్మ నిర్భర భారత్ కి ఇదో నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ‘హైడ్రోజన్ రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్ చేరడం గర్వకారణం. స్వచ్ఛమైన, సుస్థిర సాంకేతికతను రైల్వే రంగంలో విస్తరించేందుకు ఇది కీలక అడుగుగా నిలుస్తుంది’అని అన్నారు.
ఈ హైడ్రోజన్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపత్ మార్గంలో నడుస్తుంది. మధ్యలో 12 స్టేషన్లో ఆగుతూ దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10 కోచ్ లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 2600 మంది ప్రయాణం చేయవచ్చు.
హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలివే…
1. హైడ్రోజన్ రైలు సొంతంగానే కరెంట్ ను ఉత్పత్తి చేసుకుంటుంది.
2. దీని కోసం రైలులో ప్రొటాన్ ఎక్స్ ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్ అనే పవర్ ప్లాంట్ వుంటుంది.
3. 1,200 కిలోవాట్ల సామర్థ్యం వుండే ఫ్యూయెల్ సెల్ లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య చర్య జరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళ్తుంది.
4.జింద్- సోనిపత్ మధ్య రెండు రౌండ్ ట్రిప్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 356 కిలోమీటర్లు సర్వీసులు అందించనుంది. గంటకు 75 కి.మీ నుండి 120 కి.మీ. వరకు సామర్థ్యంతో నడవనుంది. జింద్ సిటీ, పాండు పిండార, లలిత్ ఖేరా, భంబేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రభ్ర, లాత్, మోహనా (హర్యానా), బర్వాస్ని, సోనిపట్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
5.ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో సహా మొత్తం 10 కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2600 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. ఈ కోచ్‌లు చాలా లగ్జరీగా ఉంటాయి. అయితే కేవలం నాన్ ఏసీ కోచ్‌లు మాత్రమే ఇందులో ఉంటాయి.
6.ఈ రైల్లో భద్రతా వ్యవస్థలు కూడా వుంటాయి. హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పు వస్తే, సెకన్లలో అప్రమత్తం చేస్తాయి.
7. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, లోకో పైలట్ కేబిన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎదుటే ఓ స్క్కీన్ కూడా వుంచుతారు. ఎప్పటికప్పుడు విషయాలను తెలియజేస్తుంది.








