ఐఎస్ఎస్ కి చేరుకున్న అనిల్ మీనన్
భారతీయ మూలాలున్న నాసా అస్ట్రోనాట్ అనిల్ మీనన్ తన మొదటి అంతరిక్ష యాత్రలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. అలాగే మరో ఇద్దరు వ్యోమోగాములు కూడా చేరుకున్నారు. బుధవారం తెల్లవారుఝామున అందులోకి చేరుకున్నారు. కజకిస్తాన్ లోని బైకనూర్ కాస్మోడ్రామ్ నుంచి భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 8:17 గంటలకు వీరి రాకెట్ బయలుదేరిన సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సరిగ్గా ఆ పై నుంచే గమనం సాగించింది. వీరి రాకెట్ 8 నిమిషాల పాటు పయనించి, ప్రాథమిక కక్ష్యలోకి చేరింది. తర్వాత మూడు గంటల పాటు ప్రయాణించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరింది.అర్ధరరాత్రి 11:52 గంటలకు దాంతో అనుసంధానం కూడా అయ్యింది.
అనిల్ మేనన్ తో పాటు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా వున్నారు. వారు 240 రోజుల పాటు కక్ష్యలోనే వుంటారు. అక్కడ 8 నెలల పాటు పలు పరిశోధనల అనంతరం ఈ ముగ్గురూ 2027 లో భూమికి తిరిగి రానున్నారు.
అనిల్ మీనన్ మొదటి అంతరిక్ష ప్రయాణం ఇది. అంతరిక్షంలో సుదీర్ఘకాలం మానవులు గడిపితే ఎదురయ్యే వైద్యపరమైన సవాళ్లపై పరిశోధనలు చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు ఈ పరిశోధనల ఫలితాలు కీలకం కానున్నాయి. ఆయనతో పాటు రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ డబ్రోవ్, అన్నా కికినా కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు. ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్న అనిల్, ఈ యాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని, మద్దతుగా నిలిచిన నాసాతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
పాలక్కాడ్‌లోని ఒట్టపాలంకు చెందిన శంకరన్ మీనన్, ఉక్రెయిన్‌కు చెందిన ఎలిజబెత్ సమోయ్లెంకోల కుమారుడే అనిల్ మీనన్. ఆయన వైద్యుడిగా, మెకానికల్ ఇంజనీర్‌గా, యూఎస్ స్పేస్ ఫోర్స్ ఫ్లైట్ సర్జన్‌గా, పైలట్‌గా పలు రంగాల్లో రాణించి చివరకు నాసా ఆస్ట్రోనాట్ బృందంలో చోటు దక్కించుకున్నారు.








