కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ‘జాయ్ ఫిల్మ్స్ #KA13 ‘బిహైండ్-ది-సీన్స్’ (BTS) వీడియో రిలీజ్
‘క’, ‘కె-ర్యాంప్’ వరుస విజయాలతో అదరగొడుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. ‘SR కళ్యాణమండపం’తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి ‘జాయ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మాతగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ “Ek Dum Bindass Pakaane Waale” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది.
కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని, విజయవంతంగా పూర్తయిన ఈ సినిమా మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన ‘మేకింగ్ వీడియో’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఉత్సాహభరితమైన సన్నివేశాలతో కూడిన ఈ వీడియోలో, సెట్లో నటీనటులు, సాంకేతిక బృందం మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
హీరోగా, రచయితగా, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న కిరణ్ అబ్బవరం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తున్నారు. మేకింగ్ వీడియోలో ఆయన సన్నివేశాలను పర్యవేక్షించడం, సహనటులకు సూచనలు ఇవ్వడం, టెక్నికల్ టీమ్‌తో షాట్లపై చర్చించడం, ఒకేసారి కెమెరా ముందు-వెనుక సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడం కనిపిస్తుంది.
అంతేకాదు, ఈ వీడియో సినిమా ఫన్ పై కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కనిపించిన సరదా సన్నివేశాలు, ఉత్సాహభరితమైన వాతావరణం చూస్తుంటే… పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా, బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త తరహా కథను ఈ చిత్రం అందించబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా నిలుస్తోంది.
ఈ చిత్రంలో దేవికా భట్ తెలుగు చిత్రసీమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.
సాంకేతిక విభాగంలో విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.








