ఎందరు ఉన్నా… దోమలు మిమ్మల్నే ఎందుకు కుడుతున్నాయి? శాస్త్రవేత్తలు విప్పిన గుట్టు!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతోంది…
దోమల బ్యాట్ కూడా వాడుతున్నారు
ఇంట్లో నలుగురు పక్కపక్కనే పడుకున్నారు…
కానీ…
ఉదయం లేచేసరికి దోమలు కుట్టిన ఎర్రటి గుర్తులు, ఆ దురద మాత్రం మీ చేతుల మీదే ఉంటాయి!
“నా రక్తం తీపిగా ఉంటుందేమో, అందుకే దోమలు నన్నే వెతుక్కుంటూ వస్తాయి” అని ఇప్పటివరకు మీరు నవ్వుకుంటూ జోక్ చేసే ఉంటారు. కానీ అసలు కారణం మీ రక్తం కాదు! మీ శరీరం నిరంతరం విడుదల చేస్తున్న ఒక ‘అదృశ్య సిగ్నల్’ అని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును, దోమలకు మీరు కనిపించడం లేదు… మీ శరీర వాసన వాళ్లకు స్పష్టంగా ‘వినిపిస్తోంది’!
దోమలు అసలు ఏం చూసి మనల్ని ఎంచుకుంటాయి?
దోమలు మనల్ని కేవలం కళ్లతో చూసి వెతకవు. వాటి వేట చాలా దూరం నుంచే మొదలవుతుంది. మనం శ్వాస ద్వారా విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను ముందుగా గుర్తిస్తాయి. ఆ తర్వాత దగ్గరకు వచ్చాక మన చర్మం నుంచి వెలువడే ప్రత్యేకమైన వాసనలను పసిగడతాయి. చివరగా శరీర ఉష్ణోగ్రత, చర్మంపై ఉండే తేమ ఆధారంగా ఎక్కడ కుట్టాలో నిర్ణయిస్తాయి. అంటే దోమలకు మీరు కనిపించడం కంటే… మీ శరీరం విడుదల చేస్తున్న “కెమికల్ సిగ్నల్” ఎక్కువగా కనిపిస్తోందన్నమాట.
ఫ్రాన్స్‌కు చెందిన వైద్య కీటక శాస్త్రవేత్త ఫ్రెడరిక్ సిమార్ ప్రకారం, కొంతమంది వ్యక్తులు సహజంగానే దోమలకు మరింత ఆకర్షణీయంగా ఉంటారు. అయితే అదే వ్యక్తి ప్రతి పరిస్థితిలోనూ దోమలకు ఫేవరెట్ అవుతాడని చెప్పలేమని ఆయన వివరిస్తున్నారు. మనం తినే ఆహారం, శారీరక పరిస్థితులు, చెమట, చర్మంపై ఉండే సూక్ష్మజీవులు వంటి అనేక అంశాలు ఈ ఆకర్షణను ప్రభావితం చేస్తాయి.
మీ శరీరం నుంచి వచ్చే వాసనే అసలు కారణం
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక్కో మనిషి శరీరం నుంచి 300 నుంచి 1,000 వరకు వేర్వేరు వాసన పదార్థాలు విడుదల అవుతాయి. అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే దోమలు ప్రత్యేకంగా గుర్తిస్తాయి. ఇటీవల 42 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, దోమలు ఎక్కువగా ఎవరిని ఎంచుకుంటున్నాయో పరిశీలించారు. ఆ పరిశోధనలో వందలాది వాసన పదార్థాల్లో 27 రకాల రసాయనాలను దోమలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నట్లు తేలింది.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా చర్మంపై ఉండే సహజ నూనె (సీబమ్) విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే 1-Octen-3-ol అనే వాసన పదార్థం కొంతమందిలో ఎక్కువగా విడుదలవుతోంది. దీనిని సాధారణంగా “మష్రూమ్ ఆల్కహాల్” అని కూడా పిలుస్తారు. ఈ పదార్థం కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా దోమలు అలాంటి వ్యక్తులను వేగంగా గుర్తిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
గర్భిణీలు, బీర్ తాగినవారిని ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేస్తాయి?
గర్భిణీలను దోమలు ఎక్కువగా కుడతాయని చాలామంది గమనించి ఉంటారు. దీనికి కారణం వారు సాధారణంగా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం, శరీర ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువగా ఉండటమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే బీర్ తాగిన తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత, చర్మ వాసన, కార్బన్ డయాక్సైడ్ విడుదలలో స్వల్ప మార్పులు వస్తాయి. నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో గత 24 గంటల్లో బీర్ తాగిన వ్యక్తులు దోమలకు మరింత ఆకర్షణీయంగా కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
అయితే బ్లడ్ గ్రూప్, చర్మం రంగు, కళ్ల రంగు లేదా జుట్టు రంగుతో దోమల ఎంపికకు బలమైన శాస్త్రీయ సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవు. అందువల్ల ఈ విషయాలపై ఉన్న చాలా నమ్మకాలు అపోహలుగానే మిగిలిపోతున్నాయి.
ప్రమాదాన్ని తగ్గించొచ్చు
వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా దోమల వ్యాప్తి పెరుగుతోంది. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు కూడా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువయ్యే నేపథ్యంలో కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
మరి ఏం చేయాలి?
చేతులు, కాళ్లు పూర్తిగా కప్పే దుస్తులు ధరించండి.
దోమతెర లేదా నాణ్యమైన రిపెల్లెంట్ ఉపయోగించండి.
ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకండి.
చెమట ఎక్కువసేపు ఉండకుండా శుభ్రంగా ఉండండి.
ఆల్కహాల్ తీసుకునే పరిమాణాన్ని తగ్గించండి.
చివరి మాట…
కాబట్టి .. ఇకపై రాత్రి పూట మీ ఇంట్లో దోమ మిమ్మల్నే కుడితే అది మీ బ్యాడ్ లక్ అనుకోకండి. ఎందుకంటే దోమలు మిమ్మల్ని యాదృచ్ఛికంగా (Random) వచ్చి కుట్టడం లేదు. మీ శరీరం విడుదల చేస్తున్న రసాయన సంకేతాలను పక్కాగా చదివి… “ఇవాళ డిన్నర్ వీళ్ల దగ్గరే!” అని ఒక ప్లాన్ ప్రకారం డిసైడ్ అయ్యి మరీ వస్తున్నాయి!








