కేరళ రేంజ్ లో ఏపీలో ఆ 23 గ్రామాలు..!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ పాలనలో సరికొత్త మైలురాయిని అందుకుంది. రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు తమ అద్భుతమైన సేవలు, పారదర్శక విధానాలకు గానూ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐఎస్ఓ (ISO) గుర్తింపును సొంతం చేసుకున్నాయి. స్థానిక సంస్థల పరిధిలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ విజయంతో సత్ఫలితాలను ఇచ్చాయని స్పష్టమవుతోంది.
గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ రికార్డులను పక్కాగా నిర్వహించడం, ప్రజలకు కావాల్సిన వివిధ రకాల ధృవపత్రాలను (సర్టిఫికెట్లు) ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన జారీ చేయడంలో ఈ 23 పంచాయతీలు విశేష ప్రతిభ కనబరిచాయి. కార్యాలయాల నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంతో పాటు, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించినందుకు గానూ ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది. ఈ అరుదైన గుర్తింపు సాధించిన గ్రామ పంచాయతీల సిబ్బందిని, అధికారులను ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఐఏఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సిబ్బంది చూపిన ప్రతిభను ఆయన కొనియాడారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో రాష్ట్రంలోని మరిన్ని గ్రామ పంచాయతీలు ఈ స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక స్వపరిపాలనలో దేశంలోనే ముందంజలో ఉన్న కేరళ రాష్ట్ర తరహాలోనే, ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలను కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే డిజిటలైజేషన్, వేగవంతమైన పౌర సేవలను విస్తృతం చేస్తూ, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఐఎస్ఓ ప్రమాణాలు దక్కేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో కసరత్తు చేస్తున్నారు.








