జనాలను ఎడిక్ట్ చేస్తున్నారంటూ Facebook, Instagram పై భారీ కేసు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక్కసారి నిజాయితీగా చెప్పండి…
“ఐదు నిమిషాలు Facebook చూస్తా…” లేదా Instagram చూస్తా అని ఫోన్ తీసుకుని… గంట తర్వాత కూడా స్క్రోల్ చేస్తూనే ఎడిక్ట్ ఉన్న సందర్భాలు మీకూ ఉన్నాయా?
ఒక Reel…
మరో Reel…
ఇంకో వీడియో…
ఒక Notification…
ఇలా చూస్తుండగానే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు.
ఇది కేవలం మీ అలవాటు మాత్రమే కాదని… Facebook, Instagram డిజైన్‌నే వినియోగదారులను ఎక్కువసేపు స్క్రీన్కు అతుక్కుపోయేలా రూపొందించారంటూ యూరోపియన్ యూనియన్ (EU) ఇప్పుడు Metaపై సంచలన ఆరోపణలు చేసింది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్‌ల వ్యసనపూరిత డిజైన్ (addictive design) ద్వారా మెటా సంస్థ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) నిబంధనలను ఉల్లంఘించిందని యూరోపియన్ కమిషన్ జూలై 10న ప్రాథమిక విచారణలో తేల్చింది.
ఇవి కూడా చదవండి
ఈ ఆరోపణలు నిజమని తేలితే… Meta తన ప్రపంచవ్యాప్త వార్షిక ఆదాయంలో 6 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుత లెక్కల ప్రకారం అది దాదాపు 12 బిలియన్ డాలర్లు (సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా). అయితే ఇది ఇంకా తుది తీర్పు కాదు. ప్రస్తుతం ఇది ప్రాథమిక నిర్ధారణ మాత్రమే. Meta ఈ ఆరోపణలను ఖండిస్తూ కోర్టులో పోరాటానికి దిగింది.
ఈ కేసు పోస్టుల గురించి కాదు… Facebook డిజైన్ గురించే!
ఈ కేసులో అసలు వివాదం Facebook లేదా Instagramలో కనిపించే పోస్టులు కాదు. యాప్‌లను ఎలా రూపొందించారన్నదే. యూజర్ బయటకు వెళ్లకుండా… ఇంకా ఇంకా స్క్రోల్ చేసేలా కొన్ని డిజైన్ పద్ధతులను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని యూరోపియన్ కమిషన్ ఆరోపిస్తోంది.
1. అంతులేని స్క్రోలింగ్ (Infinite Scroll)
ఒకప్పుడు వెబ్సైట్లలో ఒక పేజీ పూర్తయితే ఆగిపోయేది. కానీ Facebook, Instagramలో అలా కాదు. మీరు కిందికి స్క్రోల్ చేస్తే… ఇంకో పోస్ట్. మళ్లీ స్క్రోల్ చేస్తే… ఇంకో వీడియో. ముగింపు అనే భావనే ఉండదు. దీంతో “ఇంకోటి చూసి ఆపేస్తా” అనుకుంటూ నిమిషాలు గంటలుగా మారిపోతాయి.
2. అడగకుండానే ప్లే అయ్యే వీడియోలు (Autoplay)
ఒక వీడియో పూర్తికాగానే… మరో వీడియో ఆటోమేటిక్‌గా మొదలవుతుంది. మీరు ప్లే బటన్ నొక్కాల్సిన అవసరం కూడా ఉండదు. ఆలోచించేలోపే మరో కంటెంట్ మీ ముందుంటుంది.
3. పదే పదే పిలిచే Notifications
“మీ ఫ్రెండ్ కొత్త ఫోటో పెట్టారు…”, “మీ పోస్ట్‌కు కొత్త Like వచ్చింది…”, “మీ కోసం కొత్త వీడియో ఉంది…”
ఇలాంటి అలర్ట్‌లు కేవలం సమాచారం ఇవ్వడానికే కాదు… మిమ్మల్ని మళ్లీ యాప్‌లోకి తీసుకురావడానికేనని యూరోపియన్ కమిషన్ ఆరోపిస్తోంది.
4. మీకే నచ్చేవి చూపించే Algorithms
మీరు ఒక వీడియో చూసారా? అదే తరహా మరో పది వీడియోలు వస్తాయి. ఒక విషయం మీద ఆసక్తి చూపారా? మళ్లీ అదే రకం కంటెంట్ వరుసగా కనిపిస్తుంది. మీకు ఏది నచ్చుతుందో గుర్తించి… అదే చూపిస్తూ యాప్‌లో ఎక్కువసేపు ఉంచేలా Recommendation System పనిచేస్తోందని కమిషన్ పేర్కొంది.
“ఆటోపైలట్ మోడ్”లోకి మెదడు?
ఈ నాలుగు డిజైన్ ఫీచర్లు కలిసి వినియోగదారులను ఒక రకమైన “ఆటోపైలట్ మోడ్”లోకి నెట్టేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ అభిప్రాయపడింది.
ప్రత్యేకించి చిన్నపిల్లలు, టీనేజర్లు, ఎక్కువసేపు సోషల్ మీడియా వాడే వినియోగదారులపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది.
యాప్‌ల్లో ఇప్పటికే ఉన్న Screen Time లేదా Time Limit ఆప్షన్లు కూడా సరిగా పనిచేయడం లేదని, వాటిని యూజర్లు సులభంగా మూసేసి మళ్లీ స్క్రోలింగ్ కొనసాగిస్తున్నారని కమిషన్ అభిప్రాయపడింది.
అందుకే Defaultగా Autoplay నిలిపివేయడం, Infinite Scrollను పరిమితం చేయడం, నిజంగా పనిచేసే Screen Breakలను తీసుకురావాలని Metaను కోరింది.
Meta ఎందుకు కోర్టుకెళ్లింది?
యూరోపియన్ కమిషన్ ఆరోపణలను Meta పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతేకాదు… ఐర్లాండ్ మీడియా రెగ్యులేటర్ తమపై ప్రారంభించిన విచారణ కూడా చట్టబద్ధం కాదని వాదిస్తూ ఐర్లాండ్ హైకోర్టును ఆశ్రయించింది. రెగ్యులేటర్లు తమ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని Meta చెబుతోంది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంకా విచారణ దశలోనే ఉంది. Meta తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుది నిర్ణయం వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి జరిమానా విధించలేదు.
ఈ కేసు మనకు ఎందుకు ముఖ్యం?
ఇది యూరప్‌లో జరుగుతున్న కేసు అయినప్పటికీ… Facebook, Instagram వాడే కోట్లాది భారతీయులకూ ఇది ఆసక్తికరమైన అంశమే.
ఎందుకంటే మన రోజువారీ జీవితంలో కూడా… ఉదయం లేవగానే Facebook లేదా Instagram ఓపెన్ చేయడం… “ఒక్క ఐదు నిమిషాలు” అనుకుని గంటల తరబడి Reels చూడటం…పని మధ్యలో Notification వస్తే వెంటనే ఫోన్ తీసుకోవడం…ఇలాంటి అలవాట్లు చాలామందికి సాధారణంగా మారిపోయాయి.
అందుకే ఈ కేసు కేవలం Meta గురించి మాత్రమే కాదు… సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మన సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయనే పెద్ద చర్చకు దారితీస్తోంది.
చివరగా…
ఈ కథనం చదివిన వెంటనే…
ఒక్కసారి మీ ఫోన్లోని Screen Time చూసేయండి. రోజుకు Facebook, Instagramలో ఎంత సమయం గడుపుతున్నారో గమనించండి. అప్పుడు ఒక ప్రశ్న మీకే మీరు వేసుకోండి…
Facebookను మీరు ఓపెన్ చేస్తున్నారా?… లేక Facebook మిమ్మల్నే ఓపెన్ చేస్తోందా?
ఇవి కూడా చదవండి








