వైసీపీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్..!
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలతో పాటు మరికొందరిపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి న్యాయస్థానంలో బ్రేక్ పడినట్లయింది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ కీలక నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ఈ కేసును నమోదు చేసింది.
అమరావతి రాజధాని పరిధిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. అయితే, ఈ కేసులో ఎలాంటి లీగల్ ప్రాసెస్ సరిగ్గా లేదని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారంటూ ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, సీఐడీ దాఖలు చేసిన కేసులో సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును పూర్తిగా కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసు నమోదు ప్రక్రియ జరిగిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
హైకోర్టు ఇచ్చిన ఈ క్లీన్ చిట్ ప్రస్తుత కూటమి ప్రభుత్వ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, వైఎస్సార్సీపీకి చట్టపరంగా పెద్ద షాక్‌గా మారింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ మరియు ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై వరుసగా పెట్టిన కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసైన్డ్ భూముల కేసు కొట్టివేతతో అమరావతి భూముల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మరోసారి రుజువైందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.








