IRR – HC: హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ..!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అలైన్మెంట్ మార్పుల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర నిందితులకు రాష్ట్ర హైకోర్టులో భారీ ఉపశమనం లభించింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లకు చట్టబద్ధంగా విచారణార్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయని, దీనివల్ల కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూరిందని ఆరోపిస్తూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రధానంగా మూడు డిమాండ్లతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను రాష్ట్ర ఏజెన్సీల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ఇదే కేసులో చంద్రబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని రెండో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో ఉన్న ఈ కేసు విచారణను ప్రజా ప్రతినిధులప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మూడో పిటిషన్ వేశారు.
ఇవి కూడా చదవండి
ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేదు. తీర్పు సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పిటిషన్లు రాజకీయ కారణాలతో లేదా ఇతర ఉద్దేశాలతో వేసినట్లుగా ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజాహితం కంటే రాజకీయ వైరుధ్యాలే ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఒక క్రిమినల్ కేసులో మూడో వ్యక్తి జోక్యం చేసుకుని బెయిల్ రద్దు చేయాలని కోరడం లేదా దర్యాప్తు సంస్థను మార్చాలని కోరడం చట్టపరంగా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లకు ‘లోకస్ స్టాండీ’ లేదని పేర్కొంటూ విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్లను ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు, వీటిని పూర్తిగా తోసిపుచ్చింది.
ఈ తీర్పుతో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా ఈ కేసు చుట్టూ అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు హైకోర్టు పిటిషన్లను కొట్టివేయడంతో, అలైన్మెంట్ మార్పుల విషయంలో జరిగిన ఆరోపణలకు న్యాయపరంగా బలం లేదని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, నిందితులుగా ఉన్న ఇతరులకు కూడా ఈ తీర్పు సానుకూల అంశంగా మారింది. ఏసీబీ కోర్టులో ఉన్న కేసు విచారణను ప్రభావితం చేసేలా లేదా దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్న అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది.
రాజకీయ విద్వేషాలతో వేసే పిటిషన్లను న్యాయస్థానాలు ప్రోత్సహించబోవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. ఈ పరిణామంతో అమరావతి రాజధాని ప్రాజెక్టు పనుల వేగం, దానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








