అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య కేసులో ..14 ఏళ్ల బాలుడి అరెస్ట్
అమెరికాలో తెలంగాణకు చెందిన కుంచ అన్షుల్ (Kuncha Anshul)(28) హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని అమెరికా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఫిలడెల్ఫియా (Philadelphia)కు చెందిన నిందితుడిని హత్య, దొంగతనం అభియోగాలపై జులై 10న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అయితే, ఘటన సమయంలో ఆ బాలుడితో ఉన్న మరో వ్యక్తిఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చేపట్టామని, ఈ కేసు లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
నార్త్ ఫిలడెల్ఫియాలో జూన్ 5న అన్షుల్ హత్యకు గురయ్యాడు. ఎడ్గ్లీ స్ట్రీట్ (Edgley Street)లో నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటికి పిజ్జాలు డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన అతడిపై దుండగులు దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్షుల్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీ కోసమే దుండగులు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ 2023లో అమెరికాలో వెళ్లాడు. కేడబ్ల్యూసీ సంస్థ (KWC Organization)లో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్లా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.








