టార్గెట్ పికాక్స్.. ట్రంప్ ప్రయత్నం ఫలిస్తుందా..?
ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండేందుకు వీల్లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నయానో, భయానో..కాదంటే దాడులు చేసైనా ఇరాన్ ను దారికి తెస్తామని గదమాయిస్తున్నారు కూడా. అందులో భాగంగా గతంలో గతంలో ఓ పర్వతం అడుగు భాగంలో ఏర్పాటు చేసిన ఫోర్డో అణ్వాయుధ కేంద్రంపై దాడులు చేశారు. అవి ఎంతవరకూ సక్సెసయ్యాయన్నది పక్కన పెడితే.. కొంత వరకూ ఇరాన్ అణుకార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే దానికన్నా లోతున.. అమెరికా బాంబులకు అందని విధంగా ఇరాన్ ఓ అణ్వాయుధ కార్యకలాపాల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అదే పికాక్స్ పర్వతాల కింద ఉన్న రహస్య భూగర్భ అణు కేంద్రం. దీన్ని టార్గెట్ చేసిన అమెరికా…ఈ పర్వతాలలోని అణు శక్తిని ఎలాగైనా ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తోంది.
ఏమిటీ పికాక్స్ పర్వతం..?
ఇరాన్‌లోని కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) అని పిలుస్తారు. ఇది జాగ్రాస్ పర్వత శ్రేణిలో.. నతాంజ్ అణు కేంద్రాని (Natanz nuclear complex)కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫిబ్రవరి 2026లో విడుదలైన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఈ ప్రాంతంలోని ఒక భూగర్భ సముదాయాన్ని ఇరాన్ పటిష్ఠం చేస్తోంది. అందులో 330కి పైగా అడుగుల లోతులో యురేనియం నిల్వలను భద్రపరిచారు. ప్రస్తుతం ఈ పర్వతాల కింద అణు శిథిలాలను, యురేనియం నిల్వలను మాత్రమే ఉంచారని.. అణు కర్మాగారం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇప్పటి వరకు ఆ దేశం శుద్ధి చేసిన 970 పౌండ్ల యురేనియం (Uranium) నిల్వలను కూడా ఇక్కడే భద్రపరిచే అవకాశం ఉంది. దీనివల్ల తక్షణ ముప్పు లేకపోయినా.. భవిష్యత్తులో ఇరాన్ అణు ప్రయోగాలను మరింత వేగవంతం చేయడానికి ఈ పర్వతం ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫోర్డో కంటే పటిష్ఠం
ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన అణు కేంద్రం ఫోర్డో (Fordow Uranium Enrichment Plant).. టెహ్రాన్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని ఓ పర్వతానికి అడుగు భాగంలో ఉంది. దానిపై దాడులు చేయడానికి 2025లో ట్రంప్ బీ-2 స్పిరిట్ బాంబర్లు, మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ బాంబులను వినియోగించారు. కాగా పికాక్స్ పర్వతం కింద ఉన్న కేంద్రం ఫోర్డో కంటే లోతైనది.. పటిష్ఠమైనది. దీనిని ధ్వంసం చేయడం అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన బంకర్-బస్టర్ బాంబులకు కూడా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో జరగబోయే వైమానిక దాడుల నుంచి ఈ కేంద్రానికి రక్షణ కల్పిస్తూ.. ఇరాన్ భూగర్భంలో తన పనులను కొనసాగిస్తోంది.
ట్రంప్ హెచ్చరికలు..
తాము పికాక్స్ పర్వతాన్ని ధ్వంసం చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కనిపించట్లేదని.. అయినప్పటికీ దాడి చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పర్వతంపై చర్చ మొదలయ్యింది.








