పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. సిచువేషన్ రూమ్ లో ట్రంప్..!
అమెరికా యుద్ధ విమానాలు గర్జిస్తున్నాయి. ఇరాన్ ఉపరితలంపై దాడుల తీవ్రతను పెంచాయి. లోహ విహంగాలు రెక్కలు చాపుకుంటూ.. ఇరాన్ ఉపరితలంపై ప్రయాణిస్తున్నాయి. హర్మూజ్ దిగ్బంధనం, ఇరాన్‌తో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిచువేషన్ రూమ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్హెగ్సెత్ సహా ఉన్నతస్థాయి సిబ్బంది ఈ భేటీకి హాజరయ్యారు. హర్మూజ్‌లో ఆటంకం లేని ప్రయాణం, అణు డిమాండ్లు అంగీకరించేలా ఇరాన్‌పై ఒత్తిడి తేచ్చేలా దాడులకు ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో ఇరాన్‌పై దాడుల వేళ, గతంలో కీలక ఆపరేషన్ల సమయంలో ఈ గది నుంచే అమెరికా అధ్యక్షులు పర్యవేక్షించారు.
వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్ బేస్మెంట్లో ఈ సిచువేషన్ రూమ్ (Situation Room) ఉంది. 5,525 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ గదిలో కాన్ఫరెన్స్ రూమ్, ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు, ఆయన సలహాదారులు దేశం లోపల, బయట సంక్షోభ సమయాల్లో పరిస్థితులను సమీక్షించడానికి ఇక్కడ సమావేశమవుతారు.
మళ్లీ చాబహార్ టవర్ టార్గెట్ ..
తాజా దాడుల్లో అమెరికా మరోసారి చాబహార్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆ నగరంలో ఉన్న నౌకదళ వాచ్ టవర్‌పై క్షిపణి దాడి చేసింది. గతంలో ఒకసారి దాడి చేసి ధ్వంసం చేసింది. సముద్ర భద్రత, మత్స్యకారులకు సంబంధించి సహాయకచర్యల కోసం ఆ టవర్‌ను ఉపయోగిస్తున్నారు.








