కౌసల్యం 2026 ప్రారంభం
భారతీయ హస్తకళా వారసత్వానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఘన వేదిక
75కు పైగా టెక్స్టైల్ స్టూడియోలు, హస్తకళా ప్రదర్శకులు – 120కు పైగా స్టాల్స్
టెక్స్టైల్ మ్యూజియం, “సీత అన్వేషణ” తోలుబొమ్మల ప్రదర్శన, AR ఆధారిత “విరాట పర్వం” ప్రత్యేక ఆకర్షణలు
సేకరించిన నిధులు భరూన్ ఎంబ్రాయిడరీ క్లస్టర్ పునరుద్ధరణకు వినియోగం
హైదరాబాద్, జూలై 14, 2026: 1987లో స్థాపించబడిన స్వచ్ఛంద లాభాపేక్షలేని సంస్థ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ (CCT) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “కౌసల్యం 2026” ఈరోజు ప్రారంభమైంది. భారతదేశపు సమృద్ధమైన హస్తకళా సంప్రదాయాలను సంరక్షించడం, కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహించడం, సంక్షోభాలను ఎదుర్కొంటున్న కళాకార సముదాయాలకు అండగా నిలవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దీనిని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కమిటీ మెంబర్లు అందరు కలిసి ప్రారంభించారు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనకు ఈరోజు ఎంపిక చేసిన సందర్శకులకు ప్రత్యేక ప్రవేశం కల్పించారు. సాధారణ ప్రజలకు జూలై 15, 16 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉచిత ప్రవేశం అందుబాటులో ఉంటుంది.
ఈరోజు కార్యక్రమాన్ని సందర్శించిన ప్రముఖుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి గీతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి, మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి శ్రీమతి సురేఖ తదితరులు ఉన్నారు.
కౌసల్యం 2026లో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగు-ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన తోలుబొమ్మల ప్రదర్శన “సీత అన్వేషణ”, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సాంకేతికతతో రూపొందించిన చెరియాల్ చిత్రకథా అనుభవం “విరాట పర్వం” సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెక్స్టైల్ పునరుద్ధరణ నిపుణులు, కళాకార సంఘాలు, హస్తకళా సంస్థలు, పేరెన్నికగన్న హ్యాండ్‌మేడ్ బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి. హస్తకళలలోని సృజనాత్మకత, నైపుణ్యం, సుస్థిరత, సాంస్కృతిక విలువలను ప్రదర్శించే అరుదైన వేదికగా కౌసల్యం 2026 నిలుస్తోంది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సంప్రదాయ కళలను పరిరక్షించడం, ప్రోత్సహించడం, పునరుజ్జీవింపజేయడం కోసం కృషి చేస్తోంది. ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా వేలాది మంది కళాకారులకు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తోంది.


ప్రతి ఐదేళ్లకోసారి ప్రముఖ టెక్స్టైల్ పునరుద్ధరణవేత్త గౌరంగ్ షా సహకారంతో నిర్వహించే ఈ ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమం దేశంలోని అత్యుత్తమ వస్త్ర సంప్రదాయాలు, హస్తకళా ఉత్పత్తులు, కళాకార సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది.
భారతీయ హస్తకళల పట్ల అవగాహన, ఆదరణ పెంపొందించడంతో పాటు, కళాకారుల జీవనోపాధికి మద్దతు అందించడం, దేశపు కళా వారసత్వాన్ని భావితరాలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
కౌసల్యం 2026 ద్వారా సేకరించే నిధులను భరూన్ ఎంబ్రాయిడరీ క్లస్టర్ పునరుద్ధరణతో పాటు ఇతర కళాకార సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
భారతదేశంలోని అత్యంత అరుదైన సింధీ కళా సంప్రదాయాల్లో ఒకటైన భరూన్ ఎంబ్రాయిడరీ దట్టమైన చేతి కుట్టు, ఆకర్షణీయమైన డిజైన్లు, అత్యున్నత నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా మహిళా కళాకారుల ఆధారంగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని పరిరక్షించి, కళాకార కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పునరుద్ధరణ కార్యక్రమం ఉద్దేశ్యం.
75కు పైగా టెక్స్టైల్ స్టూడియోలు, హస్తకళా ప్రదర్శకులు, 120కు పైగా స్టాల్స్‌తో కౌసల్యం 2026 సందర్శకులకు విశేష అనుభూతిని అందించనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 40కు పైగా ప్రత్యేక హస్తకళా కలెక్షన్లు, వస్త్ర సంప్రదాయాల చరిత్ర, పరిణామాన్ని ప్రతిబింబించే టెక్స్టైల్ మ్యూజియం, అలాగే కళాకారులు, డిజైనర్లు, క్రియేటివ్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలకు అవకాశం కల్పించే “క్రాఫ్ట్ప్రెన్యూర్స్తో సంభాషణలు” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.
కళాకారులు, టెక్స్టైల్ స్టూడియోలు, హస్తకళా పారిశ్రామికవేత్తలు, డిజైనర్లు, కలెక్టర్లు, కళాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ భారతీయ హస్తకళా సంపదను ఘనంగా చాటిచెప్పే ఉత్సవంగా కౌసల్యం 2026 నిలవనుంది.
ఇవి కూడా చదవండి








