సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు ‘థర్డ్ లాంగ్వేజ్’ తప్పనిసరి..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థుల విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడో భాష’ (R3 – Third Language) అమలుపై బోర్డు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులందరూ ఖచ్చితంగా మూడు భాషలను చదవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో కనీసం రెండు భాషలు భారతదేశానికి చెందిన స్వదేశీ భాషలై ఉండాలి.
ఈ సరికొత్త నిబంధనల ప్రకారం, పదో తరగతి విద్యార్థులకు మూడో భాష (R3) కి సంబంధించి ఎలాంటి ప్రత్యేక బోర్డు పరీక్షలు నిర్వహించరు. అయితే, పాఠశాల స్థాయిలో నిర్వహించే అంతర్గత మూల్యాంకనం (School-based Internal Assessment) లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం వంద శాతం తప్పనిసరి. ఒకవేళ ఇంటర్నల్ అసెస్మెంట్లో క్వాలిఫై కాకపోతే, విద్యార్థులకు ఫైనల్ బోర్డు ఫలితాలు ప్రకటించకముందే పాఠశాలలు తిరిగి పరీక్ష (Reassessment) నిర్వహించి పాస్ చేయించాల్సి ఉంటుంది. టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ అందుకోవాలంటే ఈ అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది.
ఈ విద్యా సంస్కరణలు వచ్చే ఏడాది, అంటే 2027-28 విద్యా సంవత్సరంలో పదో తరగతిలోకి అడుగుపెట్టే బ్యాచ్ నుండి పూర్తిగా వర్తిస్తాయి. ఒకవేళ 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతూ ఈ అంతర్గత పరీక్షలో ఫెయిల్ అయినా.. వారిని 10వ తరగతికి ప్రమోట్ చేస్తారు. కానీ, వారు టెన్త్లో ఉన్నప్పుడే 9వ తరగతికి సంబంధించిన పెండింగ్ మూడో భాష పరీక్షను క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం (2026-27లో) 10వ తరగతి చదువుతున్న పాత బ్యాచ్ విద్యార్థులకు ఈ కొత్త థర్డ్ లాంగ్వేజ్ నిబంధనల నుండి పూర్తి మినహాయింపు లభించింది.








