కింగ్ రావడం డౌటేనా?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్(King) సినిమా రిలీజ్ డేట్‌పై కొత్త డిస్కషన్ మొదలైంది. మొదట ఈ సినిమాను 2026 క్రిస్మస్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ టార్గెట్ సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ షెడ్యూల్లో చోటుచేసుకున్న మార్పులు, నిర్మాణ ప్రక్రియలో ఏర్పడిన ఆలస్యాల కారణంగా సినిమా రిలీజ్ వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ప్రాజెక్ట్‌కు సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) దర్శకత్వం వహిస్తుండగా, షారుఖ్ ఖాన్‌తో పాటు సుహానా ఖాన్(Suhana Khan), దీపికా పదుకొణె(Deepika Padukone), అభిషేక్ బచ్చన్(Abhishek Bachan), అనిల్ కపూర్(Anil Kapoor), జాకీ ష్రాఫ్(Jockey Shroff), రాణి ముఖర్జీ(Rani Mukharjee), అర్షద్ వార్సీ(Arshad Warsi), జైదీప్ అహ్లావత్(Jaideep Ahlavath) వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్, పలు దేశాల్లో జరుగుతున్న షూటింగ్ తో ఈ సినిమాను షారుఖ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు. ఇటీవల యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ టైమ్ లో షారుఖ్ భుజానికి గాయం కావడంతో షూటింగ్ వేగంపై ప్రభావం పడినట్లు సమాచారం.
ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విస్తృత స్థాయిలో ఉండనున్నాయి. ముఖ్యంగా అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్ల ఫినిషింగ్‌కు ఎక్కువ టైమ్ పడుతుండటంతో 2026 చివరి నాటికి సినిమాను రెడీ చేయడం ఛాలెంజ్‌గా మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2027 ప్రారంభంలో రిలీజ్ చేసే అవకాశాలపై పరిశీలన జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే నిర్మాతలు లేదా చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








