‘మా సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు?’: ‘SPIRIT IS NOT ONE’ చిత్ర నిర్మాతల ఆగ్రహం
“SPIRIT IS NOT ONE” చిత్ర టైటిల్‌కు సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series పంపిన లీగల్ నోటీసులపై , వారు విధించిన నిబంధనలపై చిత్ర నిర్మాతలు శ్రీమతి చిన్నబోయిన నరసమ్మ , శ్రీ వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాతలు T-Series సంస్థ తీరును ఎండగట్టారు.
T-Series పంపిన నోటీసుల్లో ప్రధానంగా రెండు షరతులు ఉన్నాయి. ‘SPIRIT’ అనే పదంపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ, నిర్మాతలు తమ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేసుకోవాలని, హిందీ వెర్షన్ విడుదల చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదని నిబంధనలు విధించారు. అలాగే, “SPIRIT IS NOT ONE” పేరుతో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే థియేటర్లలో, ఓటీటీ (OTT) లేదా యూట్యూబ్‌లో విడుదల చేసుకునేందుకు అంగీకరిస్తేనే లీగల్ నోటీసులను వెనక్కి తీసుకుంటామని వారు షరతు విధించారు.
ఈ నిబంధనలపై చిత్ర నిర్మాతలు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తమ సినిమాను ఎవరికి అమ్ముకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలి అనేది తమ వ్యక్తిగత విషయమని, దీనిని శాసించడానికి లేదా నిబంధనలు పెట్టడానికి T-Series సంస్థ ఎవరు అని నిర్మాతలు ప్రశ్నించారు. తాము ఈ సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేసుకుంటామని, అయితే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో T-Series నిర్మిస్తున్న ‘SPIRIT’ సినిమాను వారు హిందీలో నిరభ్యంతరంగా విడుదల చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఒక సినిమాను ఏ భాషలో విడుదల చేయాలి, ఎలా అమ్ముకోవాలి అనే హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ ఏకపక్ష షరతులకు తాము అంగీకరించబోమని చిత్ర బృందం స్పష్టం చేసింది. తమ సినిమా హక్కులను, స్వేచ్ఛను కాపాడుకుంటూనే, తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే “SPIRIT IS NOT ONE” చిత్రాన్ని థియేటర్లలో అందిస్తామని వారు ప్రకటించారు.








