అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాలు నిర్మించండి … సీఎం రేవంత్ రెడ్డి
* ఎంఆర్వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలి..
* కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా వరంగల్ విమానాశ్రయం
* ఆదిలాబాద్‌కు అవసరమైన భూ సేకరణ చేపడతాం…
* కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇవి కూడా చదవండి
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు ఉన్న మెరుగైన పరిస్థితులను సీఎం వివరించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పౌరవిమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ విమానాశ్రయ పనులపై కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతో పాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతో వరంగల్ కీలక నగరంగా ఉందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో పారిశ్రామికంగా మరింతగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం తెలియజేశారు.
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలతో పాటు నల్గొండ జిల్లాలకు కేంద్రంగా వరంగల్ ఉంటుందని సీఎం తెలిపారు. వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసినందున టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై కేంద్ర మంత్రి, సీఎం చర్చించారు. వరంగల్‌కు ఘనమైన చరిత్ర ఉన్నందున, కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్ధం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. అందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సుముఖత వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్‌తో పాటు పౌర విమానాశ్రయం నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు. రెండు ఎయిర్‌పోర్ట్‌లకు అవసరమైన భూమిని సేకరించి అందజేస్తామని సీఎం తెలిపారు. వరంగల్ విమానాశ్రయంలో మాదిరే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఎంఆర్వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు నెలకొల్పాలన్నారు. వరంగల్, ఆదిలాబాద్ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలు (FTO)నెలకొల్పాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
* హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్లు నడిపే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సూచించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి సీఎంకు సూచించారు. సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, పౌరవిమానయాన శాఖ సెక్రటరీ మురళీధర్ మోహోల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
* అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాలు ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సమావేశం అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. దేశాల అభివృద్ధిలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి తాము పాటుపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో తమకు సహకరిస్తుందని, ఎక్కడైనా సమస్యలుంటే కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. ఏవైనా సమాచారలోపం ఉంటే దానిని పరస్పరం మార్చుకోవడం ద్వారా అధిగమిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వస్తున్నామని, దానిపైనా రాజకీయంగా విమర్శలు చేయడం తగదని సీఎం హితవు పలికారు.
* తెలంగాణ మాదిరే ఇతర రాష్ట్రాలు స్పందించాలి..: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విమానాశ్రయాలతోనే అనేక దేశాలు అభివృద్ధి చెందాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో విమానాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్రాలు పోటీపడుతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంత త్వరగా తెలంగాణ ప్రభుత్వం విమానశ్రయానికి అవసరమైన భూ సేకరణ చేసి ఇచ్చి చరిత్ర సృష్టించిందని ఆయన అభినందించారు. ఇంత త్వరగా స్పందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. భూ సేకరణ, ఇతర అంశాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ మాదిరే స్పందించాలని కేంద్రం మంత్రి సూచించారు. వరంగల్ సంస్కృతికి అద్దం పట్టేలా విమానాశ్రయ డిజైన్ ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి








