టీటీఏ కాన్ఫరెన్స్ వేళ… ప్రముఖులకు అవార్డులు
దువ్వూరు నాగేశ్వర రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం
మీడియారంగంలో చెన్నూరి వెంకట సుబ్బారావుకు అవార్డు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు ఛార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న మహాసభలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు టిటిఎ ఎక్సలెన్స్ అవార్డులను బహుకరించనున్నారు. సమాజ సేవ, వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, జర్నలిజం, సాహిత్యం, యువత సాధనలు, సమాచార సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులను ఈ వేదికపై సత్కరించనున్నారు. ఈ అవార్డుల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల సేవలను గుర్తించి గౌరవించడం టీటీఏ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొంటూ, అవార్డు గ్రహీతల వివరాలను ప్రకటించారు.
టిటిఎ జీవిత సాఫల్య పురస్కారంను పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డికి అందజేస్తున్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అలాగే టిటిఎ ఎక్సలెన్స్ అవార్డును మరో డాక్టర్ ఏ.వి.గురవా రెడ్డికి అందజేస్తున్నారు. తెలుగు సాంస్కృతిక-సాహిత్య పురస్కారంను వందేమాతరం శ్రీనివాస్ (కన్నెబోయిన శ్రీనివాస రావు యాదవ్) కు అందజేయనున్నారు. సామాజిక సేవకుగాను టి. రామచంద్ర రెడ్డి, కంది విశ్వభారత్ రెడ్డికి, యూత్ అచీవ్మెంట్ పురస్కారంను డాక్టర్ రమ్య చిత్రంగడకు, ఐటీ రంగంలో మహిధర్ రాయసంకు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రవీందర్ రెడ్డి రెగట్టెకు, వైద్య రంగంలో ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రవీంద్రన్‌కు అవార్డులు ప్రకటించారు.
మీడియారంగంలో విశిష్ట సేవలందించినందుకు గాను తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుకు టిటిఎ ఎక్సలెన్స్ అవార్డును అందజేయనున్నారు. అమెరికాలో తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్రింట్ పత్రికగా పేరు తెచ్చుకుంది. గత 23 సంవత్సరాలకుపైగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తూ వస్తోంది. కాలానికి తగ్గట్టు తెలుగు టైమ్స్ కూడా నేడు అటు ప్రింట్ రూపంలోనూ, పోర్టల్ రూపంలోనూ, ఇ-పత్రిక రూపంలోనూ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అమెరికాలోని తెలుగువారికే కాక, ప్రపంచంలోని తెలుగువారికి మీడియా విశేషాలను అందిస్తూ వస్తోంది. నేడు తెలుగు టైమ్స్ పత్రిక మిలియన్లమందికి చేరువైంది. అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే మహాసభలకు తనవంతుగా ప్రచారాన్ని అందిస్తూ, పాఠకులకు చేరువవుతోంది.








