జమ్మూ కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా వర్సెస్ బీజేపీ
జమ్మూ కాశ్మీర్ లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ‘‘ఆపరేషన్ లోటస్’’ పేరుతో తమ ప్రభుత్వాన్ని అస్థిరపచాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీకి చెందిన ఓ కీలక నేత, సుప్రీంకోర్టు న్యాయవాది మా పార్టీ ఎమ్మెల్యేను రహస్యంగా కలిశారు. పార్టీ మారితే రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామని, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆశ చూపారు. కానీ మా ఎమ్మెల్యేల విశ్వాసాన్ని, నిబద్ధతను వారు కొనలేకపోయారు. రూ.100 కోట్లు ఇచ్చినా నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు అమ్ముడుపోరు. బలహీనులుగా భావించి వెనుక ద్వారం గుండా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది” అని తీవ్రంగా విమర్శించారు.
సీరియస్ అయిన బీజేపీ… 100 కోట్లకు పరువు నష్టం దావా
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ తమపై లేనిపోని అభాండాలు మోపుతున్నారని బీజేపీ మండిపడింది. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ సీఎం ఒమర్ కి బీజేపీ లీగల్ నోటీసులు కూడా పంపింది. ఒమర్ అబ్దుల్లా ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలకు వెంటనే ఆధారాలు చూపాలని, లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ తరఫున ఒమర్ అబ్దుల్లాకు అధికారిక లీగల్ నోటీసు పంపారు. ఆరోపణలను నిరూపించలేకపోతే లేదా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.








