రైలు ప్రయాణికులకు అలర్ట్, రైల్వే శాఖ కీలక నిర్ణయం..!
రైళ్లలో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చాలా మంది ప్రయాణికులు టికెట్ స్క్రీన్ షాట్ (Screenshot) తీసుకోవడం లేదా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్ (WhatsApp) ద్వారా షేర్ చేయడం చేస్తుంటారు. ప్రయాణ సమయంలో టీటీఈ (TTE) అడిగినప్పుడు ఈ స్క్రీన్ షాట్లనే చూపిస్తుంటారు. అయితే, ఇకపై ఇటువంటి టికెట్లు చెల్లవని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
టికెట్ల విషయంలో జరుగుతున్న కొన్ని అక్రమాలను, నకిలీ వ్యవహారాలను అరికట్టేందుకే రైల్వే శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే టికెట్ స్క్రీన్ షాట్‌ను వేర్వేరు వ్యక్తులకు పంపి ప్రయాణాలు చేయడం, లేదా ఎడిట్ చేసిన నకిలీ డిజిటల్ టికెట్లను చూపించి రైల్వే అధికారులను మోసం చేయడం వంటి ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ రకమైన అవకతవకలకు అడ్డుకట్ట వేయడానికి ఒరిజినల్ టికెట్లను మాత్రమే అనుమతించాలని రైల్వే నిర్ణయించింది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వెంట ఖచ్చితంగా ‘ఒరిజినల్ టికెట్’ కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే.. ఐఆర్సీటీసీ నుండి నేరుగా వచ్చిన అధికారిక పీడీఎఫ్ ఫైల్ లేదా రైల్వే శాఖ పంపిన అఫీషియల్ ఎస్ఎంఎస్ (SMS) ను మాత్రమే టీటీఈకి చూపించాలి. ఒకవేళ రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ తీసుకుంటే.. ఒరిజినల్ పేపర్ టికెట్‌ను ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. కేవలం వాట్సాప్ ఇమేజ్ లేదా స్క్రీన్ షాట్లను మాత్రమే చూపిస్తే ప్రయాణికులను టికెట్ లేని వారిగా (Without Ticket) పరిగణించే అవకాశం ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అటువంటి సందర్భాలలో రైల్వే చట్టాల ప్రకారం ప్రయాణికులకు భారీ జరిమానా విధించబడుతుంది. కాబట్టి ప్రయాణికులు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. ప్రయాణానికి ముందే ఒరిజినల్ పిడిఎఫ్ ఫైల్ లేదా అఫీషియల్ మెసేజ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.








