అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు : 38 మరణ శిక్ష.. అసలు ఏం జరిగిందంటే
అహ్మదాబాద్ లో గతంలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 38 మందికి మరణ శిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ 2022 లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
అయితే.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5లక్షల పరిహారం ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31,2027 లోగా ఈ పరిహార చెల్లింపులు పూర్తి చేసేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో మొత్తం 77 మంది నిందితుల్లో 28 మందిని ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి ఎ.ఆర్. పటేల్ గతంలోనే నిర్దోషులుగా విడుదల చేశారు. శిక్షలతో పాటు, బాధితులకు మరియు వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 50,000 మరియు స్వల్ప గాయాలైన వారికి రూ. 25,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, దోషులుగా తేలిన ప్రతి ఒక్కరికీ రూ. 2.85 లక్షల జరిమానాను కూడా న్యాయస్థానం విధించింది.
2022 లో ప్రత్యేక న్యాయ స్థానం ఇచ్చిన తీర్పులో 49 మందిని దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అప్రూవర్ గా మారిన ఓ నిందితుడికి క్షమాభిక్ష కూడా ప్రసాదించింది.
అప్పట్లో ఏం జరిగిందంటే…
2008, జులై 26న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మరణించగా, 246 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా, 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.
ఈ పేలుళ్లు బస్సులు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, ఆస్పత్రుల సమీపంలోనే జరిగాయి. గాయపడినవారిని తరలించిన తర్వాత ఆసుపత్రుల వద్ద కూడా పేలుళ్లు జరగడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.








