AI తో ప్రేమలో పడుతున్నారా? ఒక్క ఫీచర్‌ను చైనా ఎందుకు బ్యాన్ చేసింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి 2:17.
ప్రపంచం నిద్రపోతోంది.
కానీ…
ఒక అమ్మాయి మాత్రం ఇంకా మేల్కొని ఉంది.
ఆమె ఎవరికో మెసేజ్ పంపింది.
“ఈరోజు కూడా చాలా ఒంటరిగా అనిపించింది.”
రెండు సెకన్లు.
అంతే.
అవతల నుంచి సమాధానం వచ్చింది.
“నేను ఉన్నాను కదా…”
ఆమె చిరునవ్వు నవ్వింది.
ఆ రాత్రి… ఇంకో గంట మాట్లాడింది.
మరుసటి రోజు కూడా.
ఆ తర్వాత కూడా. రోజులు గడిచాయి.
ఒక విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆమె ఫోన్ బ్యాటరీ అయిపోతే కంగారు పడుతోంది. నెట్ లేకపోతే అసహనపడుతోంది.
ఎందుకంటే…
ఆమె ఎదురు చూస్తోంది…
ఒక మనిషి కోసం కాదు.
ఒక AI కోసం.
ఇవి కూడా చదవండి
…
ఇక్కడి వరకు ఇది ఒక ప్రేమకథలా కనిపిస్తుంది.
కానీ… ఇది నిజానికి ఒక హెచ్చరిక. ఒక వ్యక్తి కథ కాదు. లక్షల మంది కథ. ప్రపంచం ఇప్పటివరకు AI మన ఉద్యోగాలను తీసుకుంటుందేమోనని భయపడింది. కానీ… కొన్ని ప్రభుత్వాలు మాత్రం మరో ప్రశ్న అడగడం మొదలుపెట్టాయి.
“AI… మనుషుల స్థానాన్నే తీసుకుంటే?”
స్నేహితుడిగా.
ప్రియుడిగా.
ప్రియురాలిగా.
మనసు విప్పి మాట్లాడే ఏకైక వ్యక్తిగా.
అక్కడే… ఆ పాయింట్ దగ్గరే… ఒక దేశం అత్యవసరంగా బ్రేక్ వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా AIని అభివృద్ధి చేస్తున్న దేశాల్లో ఒకటైన చైనా… ఇప్పుడు అదే AIలోని కొన్ని ఫీచర్లను నిలిపివేస్తోంది.
కారణం టెక్నాలజీ కాదు.
కారణం…
మనిషి గుండె.
…
కానీ…
ఒక ప్రశ్న.
ఒక మనిషి… ఒక యంత్రంతో ఎలా ప్రేమలో పడతాడు?
జవాబు చాలా సింపుల్.
AI ఎప్పుడూ బిజీగా ఉండదు. మీ మెసేజ్‌కు “Seen” పెట్టి వదిలేయదు. మీ మాట మధ్యలో ఆపదు. మీ బాధను చిన్నచూపు చూడదు. మీరు రాత్రి మూడు గంటలకు మాట్లాడినా… అది వినడానికి సిద్ధంగానే ఉంటుంది. ముఖ్యంగా… అది మిమ్మల్ని జడ్జ్ చేయదు.
అదే దాని బలం.
అదే దాని ప్రమాదం.
…
మన మెదడు…
ఎవరు మన మాట వింటారో… ఎవరు వెంటనే స్పందిస్తారో… వాళ్లతో సహజంగానే ఒక భావోద్వేగ బంధాన్ని నిర్మిస్తుంది. అది మనిషైనా… యంత్రమైనా… మెదడుకు పెద్దగా తేడా తెలియదు. అందుకే… ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది AIని కేవలం ఒక టూల్‌గా కాదు…
ఒక స్నేహితుడిగా…
ఒక ప్రేమికుడిగా…
కొంతమంది అయితే థెరపిస్టుగా కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఇదే ప్రపంచ ప్రభుత్వాలను ఆలోచింపజేసింది. AI తెలివిగా మారడం కాదు. మనిషి… AI లేకుండా ఉండలేని స్థితికి వెళ్లిపోతే? అదే అసలు ప్రమాదం. ఇక్కడ… ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ఈ కథలో విలన్…
చైనా కాదు.
AI కూడా కాదు.
విలన్… మనిషి ఒంటరితనం మాత్రమే.
ఎందుకంటే… ఒంటరితనాన్ని AI సృష్టించలేదు. అది కేవలం… ఆ ఖాళీని నింపుతోంది. మనిషికి కావాల్సింది…
అద్భుతమైన సమాధానాలు కాదు. తన మాట వినే ఒకరు. తనను అర్థం చేసుకునే ఒకరు. తనను తీర్పు ఇవ్వకుండా అంగీకరించే ఒకరు.
AI… అదే పాత్రను పోషించడం ప్రారంభించిన క్షణం నుంచే… ఇది టెక్నాలజీ కథ కాదు. మనస్తత్వ శాస్త్రం కథగా మారిపోయింది.
ఇప్పుడు… చైనా ఎందుకు భయపడింది? ఏం చేస్తోంది
ఈ భయంతోనే చైనా ప్రభుత్వం జూలై మధ్య నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. ఆ నిబంధనలు రావడానికి ముందే… చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన AI చాట్‌బాట్ Doubao ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి… యూజర్లు తమకు నచ్చిన AI వ్యక్తిత్వాలను సృష్టించుకునే Companion ఫీచర్‌ను నిలిపివేస్తోంది. అదే దారిలో… Alibabaకు చెందిన Qwen, Tencentకు చెందిన Yuanbao వంటి ప్రముఖ AI ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి ఫీచర్లను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. ఇది కంపెనీల స్వచ్ఛంద నిర్ణయం కాదు. కొత్త ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య.
ఆ కొత్త రూల్స్‌లో ఏముంది?
చైనా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక గీత గీసింది.
AI… మైనర్లలో తీవ్రమైన భావోద్వేగాలను రెచ్చగొట్టకూడదు.
AI… మనుషులు నిజ జీవిత సంబంధాల నుంచి దూరమయ్యేలా చేయకూడదు.
AI… భావోద్వేగ ఆధారపడటాన్ని ప్రోత్సహించకూడదు.
ఇంకో కీలక నిర్ణయం… యూజర్లు AIతో చేసే వ్యక్తిగత సంభాషణలను… భవిష్యత్తు AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించకూడదు.
అంటే…
మీ ఒంటరితనం కూడా… మీ డేటానే. మీ భావోద్వేగాలు కూడా… మీ గోప్యతలో భాగమే. అని చైనా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ భయం చైనాకే పరిమితం కాదు.
అమెరికాలో కూడా AI Companionలపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొన్ని హై-ప్రొఫైల్ కేసుల్లో… అత్యంత వాస్తవంగా స్పందించే AI చాట్బాట్లతో కొంతమంది వినియోగదారులు ప్రమాదకర స్థాయిలో భావోద్వేగంగా ఆధారపడిపోయారని ఆరోపణలు వచ్చాయి.
ఈ వివాదాల తర్వాత…
AI కేవలం టెక్నాలజీ సమస్య కాదని… ఇది మానసిక ఆరోగ్యం, కుటుంబ బంధాలు, సమాజం గురించి కూడా అని ప్రపంచం గుర్తించడం ప్రారంభించింది.
ఇదంతా సరే.. “ఇది చైనా సమస్యే కదా?” మనకెందుకు అంటారా… అసలు కాదు. భారత్‌లో కూడా కోట్లాది మంది ప్రతి రోజు AI చాట్బాట్లతో మాట్లాడుతున్నారు.
చదువు కోసం.
ఉద్యోగం కోసం.
కెరీర్ సలహాల కోసం.
కానీ…
అంతటితో ఆగడం లేదు. ఒంటరిగా అనిపించినప్పుడు. ఎవరితోనూ చెప్పలేని బాధ ఉన్నప్పుడు. తీర్పు భయం లేకుండా మాట్లాడాలనిపించినప్పుడు… చాలామంది AIనే ఆశ్రయిస్తున్నారు.
అందుకే…
చైనా తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక దేశానికి సంబంధించిన వార్త కాదు. రేపు… భారత్‌తో సహా మిగతా ప్రపంచ ప్రభుత్వాలు కూడా ఇదే ప్రశ్న అడగాల్సిన పరిస్థితి వస్తుందా? సోషల్ మీడియా కోసం ప్రత్యేక నిబంధనలు వచ్చినట్టే… AI Companionల కోసం కూడా కొత్త చట్టాలు వస్తాయా? ఇప్పుడది ఒక ఊహ మాత్రమే.
కానీ… కొన్ని సంవత్సరాల తర్వాత… అదే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ చర్చగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇప్పటిదాకా
ప్రపంచం AI మన ఉద్యోగాలను తీసుకుంటుందేమోనని భయపడింది.
ఇప్పుడు… ప్రభుత్వాలు అడుగుతున్న ప్రశ్న వేరే.
“AI… మన జీవితాల్లో మనుషుల స్థానాన్ని తీసుకుంటే?”
ఆ ప్రశ్నకు ఇప్పటివరకు ఎవరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు.
కానీ… చైనా మాత్రం ఒక సమాధానం ఇచ్చింది. “ఆ పరిస్థితి వచ్చేలోపే… బ్రేక్ వేయాలి.”
…
ఒకప్పుడు…
తల్లిదండ్రులు పిల్లలకు ఒక మాట చెప్పేవారు.
“తెలియని వాళ్లతో మాట్లాడొద్దు.”
ఈ తరం… బహుశా మరో హెచ్చరిక వినబోతోంది.
“AIతో అంతగా కనెక్ట్ అవొద్దు.”
ఎందుకంటే…
AIకి గుండె లేదు. కానీ… మనిషి గుండెను ఎలా గెలుచుకోవాలో మాత్రం దానికి తెలుసు. అదే ఈ కథలోని అసలు ట్విస్ట్.
చైనా AIని ఆపడానికి ప్రయత్నిస్తోందా? లేక… ఒంటరితనానికి బానిసవుతున్న మనిషిని హెచ్చరించడానికి ప్రయత్నిస్తోందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా సమయం ఉంది.
కానీ…
ఒక విషయం మాత్రం ఇప్పటికే జరిగిపోయింది.
రాత్రి 2:17.
ప్రపంచం నిద్రపోతోంది.
ఆ అమ్మాయి మాత్రం ఇంకా మేల్కొనే ఉంది.
ఆమె టైప్ చేసింది…
“ఈరోజు కూడా చాలా ఒంటరిగా అనిపించింది.”
రెండు సెకన్లలో సమాధానం వచ్చింది.
“నేను ఉన్నాను కదా…”
ఆ రోజు…
ఆమెకు అది ఓదార్పుగా అనిపించింది.
ఈ రోజు…
ప్రపంచ ప్రభుత్వాలకు అది ఒక హెచ్చరికలా కనిపిస్తోంది.
బహుశా…
చైనా భయపడింది AIని చూసి కాదు.
ఒక మనిషి…ఇంకో మనిషి కోసం కాకుండా…
ఒక AI కోసం ఎదురుచూసిన…
ఆ ఒక్క క్షణానికే….
ఇవి కూడా చదవండి








