బాంబులు కాదు… నీటి బిందువులే! పాకిస్థాన్‌ను వణికిస్తున్న భారత్ కొత్త గేమ్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఆ ఉదయం… ప్రపంచం ఎప్పటిలాగే మేల్కొంది.
సూర్యుడు ఉదయించాడు.
సరిహద్దు నిశ్శబ్దంగానే ఉంది.
రాడార్లు ఎలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు.
యుద్ధ విమానాలు రన్‌వేలపై నుంచి ఎగరలేదు.
సరిహద్దులో…
ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు.
అయినా…
పాకిస్థాన్‌లో ఏదో కంగారు.
ఎందుకంటే…
చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధాలు కొన్నిసార్లు తుపాకులతో కాదు… ఒక నిర్ణయంతో ప్రారంభమవుతాయి.
ఆ ఉదయం… ఇస్లామాబాద్‌ను వెంటాడింది ఒకే ఒక్క ప్రశ్న.
“భారత్… చివరికి తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించడం ప్రారంభించిందా?”
ఇవి కూడా చదవండి
ఆ ఆయుధం అణుబాంబు కాదు.
మిసైల్ కాదు.
యుద్ధ విమానం కాదు.
నీరు.
ఒక చుక్క నీరు… ఒక బుల్లెట్ కంటే ప్రమాదకరమా?
వినటానికి ఇది అతిశయోక్తిలా అనిపించొచ్చు.
కానీ… ఒక దేశం ఆహార భద్రత… రైతాంగం… తాగునీరు… విద్యుత్… ఆర్థిక వ్యవస్థ… అన్నీ ఒకే నదిపై ఆధారపడి ఉంటే? అప్పుడు… ప్రతి చుక్క నీరు… ఒక వ్యూహాత్మక ఆస్తిగా మారుతుంది. పాకిస్థాన్‌కు ఇండస్ నదీ వ్యవస్థ అలాంటిదే. అందుకే భారత్ తీసుకునే ప్రతి జల నిర్ణయం… వాళ్ళకు ముంచుకు వస్తున్న ప్రళయంలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది
చాలామంది అనుకుంటున్నారు… భారత్ నదులను పూర్తిగా ఆపేస్తోందని. కానీ… అసలు వ్యూహం అది కాదు. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఇండస్ జలాల ఒప్పందం ప్రకారం మొత్తం ఆరు నదులు రెండు దేశాల మధ్య విభజించబడ్డాయి. రావి, బియాస్, సట్లెజ్ నదులపై పూర్తి హక్కులు భారత్‌కు ఉన్నాయి.
ఇండస్, జీలం, చెనాబ్ నదుల ప్రధాన ప్రవాహం పాకిస్థాన్‌కు వెళ్తుంది. అయితే వాటిపై కూడా భారత్‌కు పరిమిత స్థాయిలో Run-of-the-River Hydropower ప్రాజెక్టులు నిర్మించే హక్కు ఉంది. ఇప్పుడే భారత్ చేస్తున్నది… తనకు చట్టబద్ధంగా ఉన్న ప్రతి చుక్క నీటిని పూర్తిగా వినియోగించుకోవడమే.
దశాబ్దాలుగా పూర్తిగా ఉపయోగంలోకి రాని తూర్పు నదుల నీరు…
కొత్త బ్యారేజీలు…
కొత్త డ్యామ్‌లు…
కొత్త కాలువలు…
షాహ్పూర్ కండి, ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వంటి పనులకు వేగం… ఇవన్నీ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి.
“భారత్‌కు చెందిన నీరు… ముందుగా భారత్‌కే ఉపయోగపడాలి.”
ఇదే కొత్త వాటర్ డాక్ట్రిన్.
పాకిస్థాన్‌ను భయపెడుతున్నది… ఒక శబ్దం కాదు. ఒక నిశ్శబ్దం.
ఇది ఒక రోజు కథ కాదు. ఒక సీజన్ కథ కాదు. దశాబ్దాల కథ. పాకిస్థాన్ వ్యవసాయంలో భారీ భాగం ఇండస్ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉంది. లక్షలాది ఎకరాల సాగు… పలు ప్రాంతాల తాగునీటి అవసరాలు… జలవిద్యుత్ ఉత్పత్తి… ఈ నదీ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. అందుకే… భారత్ తన వాటా నీటిని మరింత సమర్థంగా వినియోగించడం ప్రారంభిస్తే… నీటి ప్రణాళికలు మారవచ్చు. సాగు పద్ధతులు మారవచ్చు. నీటి కొరత రావచ్చు. వ్యవసాయ ఉత్పత్తిపై ఒత్తిడి పెరగవచ్చు. నీటి నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు.
దాని ప్రభావం…
గ్రామాల నుంచి మార్కెట్లకు…
మార్కెట్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు…
ఖజానా నుంచి రాజకీయాల వరకు చేరే అవకాశం ఉంది.
అందుకే…
ఇస్లామాబాద్‌ను కలవరపెడుతున్నది ఒక డ్యామ్ కాదు. భారత్ మారిపోయిన ఆలోచన.
భారత్ ఇంతకాలం ఎందుకు ఇలా చేయలేదు?
1960లో కుదిరిన ఇండస్ జలాల ఒప్పందం… ఆ కాలానికి సరిపోయింది. అప్పుడు… క్లైమేట్ చేంజ్ లేదు. భూగర్భ జలాల సంక్షోభం లేదు. 140 కోట్ల జనాభా లేదు. ఇప్పటి స్థాయిలో నీటి అవసరాలు కూడా లేవు. కానీ… ఈరోజు భారత్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది భారతదేశంలో ఉన్నా… ప్రపంచ స్వచ్ఛమైన నీటి వనరుల్లో భారత్ వాటా కేవలం 4 శాతం మాత్రమే. దేశంలోని 15 ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో 11 ఇప్పటికే Water-Stressed జోన్లోకి చేరాయి. ప్రతి వేసవిలో… తగ్గుతున్న భూగర్భ జలాలు… అనిశ్చిత వర్షాలు… పెరుగుతున్న జనాభా… ఈ పరిస్థితుల్లో… ప్రతి చుక్క నీటి విలువ పూర్తిగా మారిపోయింది.
పహల్గామ్ తర్వాత మారిన లెక్క
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత… ఢిల్లీలో ఒక ఆలోచన మరింత బలపడింది.
“Blood and Water Cannot Flow Together.”
గతంలో భారత్ ప్రకటించిన ఈ సందేశం ఇప్పుడు కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు… నీటి విధానంలో కనిపిస్తున్న కొత్త దిశకు సంకేతంగా చాలా మంది విశ్లేషకులు చూస్తున్నారు. జాతీయ భద్రత ఒకవైపు… నీటి వ్యూహం మరోవైపు… అనే రోజులు ముగిశాయి. ఇప్పుడు… దేశ భద్రతలో నీటి నిర్వహణ కూడా ఒక భాగమవుతోంది.
భారత్‌కు లాభం ఏమిటి?
ప్రతి చుక్క నీరు దేశంలోనే ఉపయోగపడితే… రైతుకు మరింత సాగునీరు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే… భారత్‌లో ఉపయోగించే మంచినీటిలో దాదాపు 80 శాతం వ్యవసాయానికే వెళ్తుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే… మరిన్ని జలవిద్యుత్ అవకాశాలు వస్తాయి. వర్షాభావాన్ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
దేశంలోని అనేక నగరాలు ఇప్పటికీ తమ రోజువారీ గరిష్ఠ నీటి అవసరంలో సుమారు 70 శాతం మాత్రమే తీర్చుకోగలుగుతున్నాయి. అందుకే… ప్రతి చుక్క నీరు ఇప్పుడు కేవలం ఒక సహజ వనరు కాదు… దేశ భవిష్యత్తును నిర్ణయించే వ్యూహాత్మక సంపద.
అసలు ట్విస్ట్
చాలామంది ఈ కథనాన్ని.. “పాకిస్థాన్‌కు నీళ్లు” అనే కథగా చూస్తారు. కానీ…అది ఇందులో ఒక భాగం మాత్రమే. అసలు కథ… భారత్ తన అత్యంత విలువైన సహజ వనరును వ్యూహాత్మక శక్తిగా మార్చడం.
ఒకప్పుడు దేశాలు చమురును ఆయుధంగా ఉపయోగించాయి. ఈరోజు ప్రపంచం డేటాను ఆయుధంగా ఉపయోగిస్తోంది. రేపు… నీరు కూడా అదే స్థాయిలో వ్యూహాత్మక వనరుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ మాత్రం… ఆ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది.
ఎందుకంటే…
ఒక బుల్లెట్ ఒక్క క్షణాన్ని మాత్రమే మార్చగలదు.
కానీ… ఒక చుక్క నీరు… ఒక దేశ భవిష్యత్తు దిశను పూర్తిగా తరాలు పాటు మార్చగలదు.
ఇది కేవలం రెండు దేశాల కథ కాదు. 21వ శతాబ్దంలో నీరు కూడా చమురు, డేటా లాగే జియోపాలిటికల్ ఆయుధంగా మారుతున్న ప్రపంచ కథ.
ఇవి కూడా చదవండి








