జులై 9 వరకూ పాక్ కు డెడ్ లైన్.. ఆ తర్వాత ఫైనల్ యాక్షన్..
పీఓకేలో ఆందోళనలు తీవ్ర రూపుదాల్చాయి. అవి ఎంతగా అంటే సాక్షాత్తూ పాక్ ప్రభుత్వానికే పీఓకే నేతలు అల్టిమేటమిచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తుంటే.. వాటిని అణచివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అణచివేతలకు బెదిరేది లేదని.. డిమాండ్లు పరిష్కారంకాకుంటే.. జులై 9న ఫైనల్ యాక్షన్ను ప్రారంభిస్తామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. తమ నిరసనల్లో భాగం కావాలని పీఓకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. ఆ రోజున పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఐరాస ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఆ డెడ్లైన్ గడువు వరకు క్షమశిక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది.
పాక్ (Pakistan) ప్రభుత్వ అణచివేతలు, పౌరుల హత్యలను అంతర్జాతీయ సమాజం గమనించాలని జేఏఏసీ అభ్యర్థించింది. నిరసనల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించింది. సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోవద్దని, నిర్బంధంలో ఉన్న తమ నాయకులను విడిచిపెట్టాలని, 38 పాయింట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రజల డిమాండ్లకు తూటాలతో స్పందిస్తే.. తమకు ఇతర మార్గాలు ఉన్నాయని పాక్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది.
భారత్ సహాయం కావాలి..
‘‘మాకు భారత్ సహాయం కావాలి. ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొరత ఉంది. మానవతా సాయం అందించండి’’ అని పీఓకే నేతలు కోరినట్టుగా ఆ వీడియోలో ఉండటం గమనార్హం. నిరసనలను కఠినంగా అణచివేస్తోన్న పాక్.. ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిందని ఆరోపించారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్కు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.
గత కొన్నిరోజులుగా పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనలకు మద్దతు ఇస్తున్న జేఏఏసీని పాక్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. ఈ కమిటీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తలను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నిరసనకారులను అణచివేయడానికి పీఓకేలోకి వెళ్తున్న నిత్యావసర సరకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులను ప్రభుత్వం అడ్డుకుంది.








