50 కోట్ల వ్యూస్! Netflix ఆల్‌టైమ్ రికార్డ్… అసలు మ్యాజిక్ ఏంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే ఆల్-టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్!
ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 కోట్లకు పైగా వ్యూస్!
ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి డిజిటల్ విస్ఫోటనం!
ఇక్కడ ఏ స్టార్ హీరో లేడు. వందల కోట్ల ప్రమోషన్ల హడావుడి అస్సలే లేదు. థియేటర్లలో నెలల తరబడి కటౌట్లు, హంగామాలు జరగలేదు.
కానీ… గ్లోబ్ మొత్తం ఇప్పుడు ఒకే ఒక్క సినిమా గురించి మాట్లాడుకుంటోంది! ఆ సినిమాలోని పాటలు వరల్డ్ ఫేమస్ బిల్బోర్డ్ చార్ట్స్‌ను షేక్ చేస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా… ప్రేక్షకులే ఓనర్లుగా మారి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్నారు.
ఒక దేశ సంస్కృతిని, గ్లోబల్ ఆడియన్స్‌కు సరికొత్తగా పరిచయం చేసింది.
ఇప్పుడు…
ప్రతి మేకర్…
ప్రతి పెద్ద స్టూడియో…
ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫారమ్…
తలలు పట్టుకుని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాయి:
“అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది?”
అసలు…
50 కోట్ల మంది ఇందులో ఏమి చూశారు?
ఆ ప్రశ్నకు సమాధానం…
ఒక అద్భుతమైన కథలో ఉంది.
ఒక కొత్త ఆలోచనలో ఉంది.
ఏళ్ల క్రితం, ప్రపంచ పటంలో తన దేశం ఎక్కడుందో కూడా తెలియని రోజుల్లో… ఒక చిన్నారి మనసులో రగిలిన కసితో కూడిన కలలో ఉంది.
ఆ అమ్మాయి పేరు… మ్యాగీ కాంగ్!
ఆ మ్యాప్ వెనుక దాగున్న ఒక చిన్నారి ఆవేదన!
మ్యాగీ కాంగ్ చిన్న వయసులో ఉన్నప్పుడు స్కూల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. తాను కొరియన్ అని గర్వంగా చెబితే, ఆ క్లాస్ టీచర్ ఆమెను చైనీస్ అనుకున్నాడు… ఆ తర్వాత జపనీస్ అని ఊహించాడు. చివరకు “నేను కొరియా నుండి వచ్చాను” అని మ్యాగీ గట్టిగా చెబితే… ఆ టీచర్ మ్యాప్ మొత్తం వెతికినా కొరియా ఎక్కడుందో గుర్తించలేకపోయాడు!
ప్రపంచ పటంలో తన దేశానికి కనీస గుర్తింపు కూడా లేదన్న ఆ చేదు నిజం, ఎనిమిదేళ్ల ఆ చిన్నారి మనసులో ఒక చిన్న మంటను రేపింది. “ఎప్పుడో ఒక రోజు… మా సంస్కృతి అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలిసేలా ఒక సినిమా తీయాలి” అని ఆ రోజే బలంగా నిర్ణయించుకుంది.
హాలీవుడ్ తిరస్కరణ… ఒకే ఒక్క సంతకం!
పెద్దయ్యాక హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి Shrek, Kung Fu Panda, Minions, Puss in Boots వంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాలకు యానిమేటర్‌గా పనిచేసినా, తన కన్న కలని మాత్రం ఆమె మర్చిపోలేదు. తన దేశపు మూలాలతో ఒక సినిమా తీస్తానని హాలీవుడ్ స్టూడియోల చుట్టూ తిరిగితే ఎవరూ అవకాశం ఇవ్వలేదు.
చివరకు… “ఎవరూ తీయకపోతే ఏంటి… నా కథను నేనే తీస్తాను!” అని ఒంటరిగా కలం పట్టింది. కొరియన్ జానపద పురాణాలను (Folklore), నేటి తరం కె-పాప్ (K-Pop) గ్లామర్‌తో ముడిపెట్టి KPop Demon Hunters కథను సిద్ధం చేసింది.
అసలు ఏంటా కథ?
కథ వినడానికి చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ‘హంట్రిక్స్’ అనే K-Pop గర్ల్ బ్యాండ్… పగలంతా కోట్లాది అభిమానులను అలరించే సంగీత తారలు. రాత్రి అయితే అదే అమ్మాయిలు… ప్రపంచాన్ని కాపాడే డెమోన్ హంటర్స్.
వాళ్లను ఓడించడానికి రాక్షసులు కూడా మరో K-Pop బాయ్ బ్యాండ్‌ను తయారు చేస్తారు. ‘సజా బాయ్స్’. మ్యూజిక్ ఇండస్ట్రీనే యుద్ధభూమిగా మార్చిన ఈ కథ ప్రపంచ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇచ్చింది.
వాస్తవానికి ఈ సినిమా కేవలం యాక్షన్ గురించి కాదు. మనిషి తన అసలు గుర్తింపును దాచుకోవాల్సి వచ్చిన బాధ… ఒంటరితనం… అవమానం… అంతర్గత సంఘర్షణ… చీకటితో చేసే పోరాటం… ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే ఈ సినిమా భాషను దాటి… దేశాలను దాటి… ప్రపంచాన్ని తాకింది.
దర్శకురాలు మ్యాగీ కాంగ్, సహ-దర్శకుడు క్రిస్ అపెల్హాన్స్తో కలిసి కొరియన్ జానపద పురాణాలను, నేటి తరం గ్లోబల్ ఆడియన్స్‌కు నచ్చే సార్వత్రిక భావోద్వేగాలతో (అధికారం, వినాశనం, బాధ, అవమానం) ముడిపెట్టి ఈ విజువల్ వండర్‌ను సృష్టించారు. కేవలం పిల్లలే కాదు, కుటుంబాలు సైతం ఈ సినిమాకు ఫిదా అయిపోయాయి.
అంచనాలు లేని చోటే… అద్భుతం జరిగింది!
హాలీవుడ్లో సీక్వెల్స్, రీమేక్‌ల హడావుడి నడుస్తున్న ఈ రోజుల్లో, 2025 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ ఒరిజినల్ యానిమేటెడ్ మ్యూజికల్ చిత్రం ఒక సంచలనంగా మారింది. మొదట్లో ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ‘సోనీ’ సంస్థ సైతం దీని గ్లోబల్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేసింది. ఇండస్ట్రీ భాషలో చెప్పాలంటే ఇదొక ‘అండర్ డాగ్’ (గెలవదనుకున్న గుర్రం).
కానీ, విడుదలైన మొదటి వారంలోనే 20 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయిన ఈ సినిమా, ఆ తర్వాత కూడా అదే వేగాన్ని కొనసాగించి, కేవలం ఎనిమిది నెలల్లో ఏకంగా 500 మిలియన్ల (50 కోట్లు) వీక్షణలను దాటేసింది. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన నంబర్ వన్ సినిమాగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ సినిమా విజయానికి అసలు హీరో ఎవరు?
Netflix కాదు.
మార్కెటింగ్ కాదు.
ప్రేక్షకులే.
ఈ సినిమాకు మొదట్లో పెద్దగా ప్రచారం జరగలేదు. ఒక ట్రైలర్ విడుదలైంది. అంతే. మిగతా పని అభిమానులే చేశారు.
TikTok…
Instagram…
YouTube…
డాన్స్ కవర్లు…
ఫ్యాన్ వీడియోలు…
రీల్స్…
లక్షలాది మంది స్వచ్ఛందంగా ఈ సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఒకరు చూసి ఇంకొకరికి చెప్పారు. ఆ ఇంకొకరు మరో పది మందికి చెప్పారు. అలా ప్రపంచవ్యాప్తంగా Word of Mouth ఈ సినిమాను చరిత్రలో నిలబెట్టింది. దర్శకురాలు కూడా “మా అభిమానులే మా అసలు మార్కెటింగ్ టీమ్” అని చెప్పడం విశేషం.
సినిమాలోని సంగీతం మరో మాయ చేసింది.
ప్రత్యేకంగా “Golden” పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ సినిమా ఆల్బమ్‌లోని ఏకంగా నాలుగు పాటలు Billboard Hot 100 Top-10లో చోటు దక్కించుకున్నాయి. ఒక సినిమా సౌండ్‌ట్రాక్‌కు ఇలాంటి ఘనత దక్కడం ఇదే తొలిసారి.
అవార్డుల వేటలో… ఆస్కార్ రేసులో!
ఈ ‘కార్టూన్’ సినిమా సాధించిన సక్సెస్ కేవలం వ్యూస్‌కే పరిమితం కాలేదు. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్, గ్రామీ అవార్డులను కైవసం చేసుకుని హాలీవుడ్ పెద్దలనే ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగకుండా, ఏకంగా రెండు ఆస్కార్ నామినేషన్లను దక్కించుకుని అవార్డుల రేసులో నిలిచింది.
సంగీత ప్రపంచంలో అయితే ఇదొక పెద్ద సంచలనం. సినిమాలోని “గోల్డెన్” (Golden) అనే పాటతో పాటు మొత్తం నాలుగు పాటలు ప్రపంచ ప్రఖ్యాత బిల్బోర్డ్ హాట్ 100 టాప్ 10 లో చోటు సంపాదించుకున్నాయి. ఒక సినిమా ఆల్బమ్‌కు ఈ స్థాయి రికార్డ్ రావడం మ్యూజిక్ హిస్టరీలోనే ఇదే మొదటిసారి.
డిజిటల్ స్క్రీన్ పైనే కాదు… థియేటర్లలోనూ అదే హంగామా!
ఓటీటీలో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా, థియేటర్లలోనూ ఒక కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. సెప్టెంబర్‌లో కేవలం రెండు రోజుల పాటు థియేటర్లలో విడుదల చేసిన దీని ‘సింగాలాంగ్’ (థియేటర్లో పాటలు వస్తున్నప్పుడు ఆడియన్స్ కూడా కలిసి పాడే షో) వెర్షన్… యూఎస్, కెనడా బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓటీటీ కంటెంట్‌ను కూడా థియేటర్లలో ఫ్యాన్స్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లా ఎంజాయ్ చేయవచ్చని ఈ సినిమా నిరూపించింది.
ఒక ప్రాంతీయ సంస్కృతిని నమ్ముకుని, స్వచ్ఛమైన కథ, అద్భుతమైన యానిమేషన్, గుండెకు హత్తుకునే సంగీతంతో వస్తే… ఒక చిన్న కార్టూన్ సినిమా కూడా ప్రపంచాన్నే శాసించగలదని, ఓటీటీ చరిత్రనే మార్చేయగలదని ‘కె-పాప్ డెమోన్ హంటర్స్’ నిరూపించింది.
నిజానికి..
మ్యాగీ కాంగ్‌కు ఈ విజయంలో అత్యంత సంతోషం ఇచ్చింది అవార్డులు కాదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట.
“ఈ సినిమా చూసిన తర్వాతే K-Pop గురించి తెలుసుకున్నాం.”
“ఇప్పుడు కొరియన్ సంగీతం వింటున్నాం.”
“కొరియన్ సంస్కృతిని తెలుసుకోవాలనిపిస్తోంది.”
ఆమె చిన్నప్పటి కల అదే. తన దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం. ఇప్పుడు… ఆ కల నిజమైంది.
ఈ కథనం మనకేం గుర్తు చేస్తోంది?
ప్రపంచాన్ని మార్చేది ఎప్పుడూ పెద్ద బడ్జెట్ కాదు… ప్రపంచం నమ్మేంత వరకు వదిలిపెట్టని ఒక చిన్న కల. దాన్ని నమ్మి చివరి వరకు నడిచే ఒక మనిషి.
మిగతాదంతా…
చరిత్రే రాసుకుంటుంది.








