మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సహకరించండి : బీసీ జనార్దన్ రెడ్డి
సరుకు రవాణా, ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమైన అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి (BC Janardhan Reddy) చెప్పారు. ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal)ను కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) నేతృత్వంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు (MT Krishna Babu), ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, ఉన్నతాధికారులు కలిశారు.
రాష్ట్రంలో మారిటైమ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని జనార్దన్‌రెడ్డి తెలిపారు. తూర్పు తీరంలో ఏపీని దేశంలోనే ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్ బిల్డింగ్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రం చేపడుతున్న కీలక మారిటైమ్ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పోర్టు ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. సాగర్మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లి జిల్లాలోని ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టులకు అనుసంధాన రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.








