ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు : ప్రకటించిన సర్కార్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం ఉభయ సభల సమావేశాల షెడ్యూల్ను రిజిజు ప్రకటించారు.
ఈ సమావేశాల్లో దేశ ప్రాధాన్య అంశాలపై విస్తృత చర్చలు, చట్టాలపై పరిశీలన, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘జాతీయ ప్రయోజన సంబంధిత అంశాలపై అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులు జరగాలని రిజిజు ఆకాంక్షించారు.
రాజకీయ సమీకరణాలు మారుతుండటం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు దూకుడుగా సిద్ధమవుతుండడంతో ఈ సమావేశాలు అత్యంత వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందే శివసేన(షిండే వర్గం)లో చేరిన ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు, 20 మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల విలీనానికి సంబంధించిన అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా, లోటు వర్షపాతం, కరవు, వరదలు, నీట్ ప్రశ్నపత్రం లీక్, అయోధ్య రామాలయ కానుకలు, విరాళాల చోరీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిపక్షం సన్నద్ధమవుతున్నది. అంతేగాక ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు చెందిన సమస్యలు, ప్రాంతీయ పార్టీలలో అంతర్గతంగా జరుగుతున్న చీలికలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై కూడా విపక్షాలు పార్లమెంట్లో విపక్షాలు నిలదీసే అవకాశాలున్నాయి.








