వైభవ్ ది సచిన్, కోహ్లీ రేంజ్: కపిల్ దేవ్
భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై(Vaibhav Suryavanshi) టీమిండియా ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించారు. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో(Virat Kohli) ఒకప్పుడు చూసినటువంటి అద్భుతమైన సహజ సిద్ధమైన ప్రతిభ దాగి ఉందని కపిల్ దేవ్ కొనియాడారు. అయితే, ఈ యువ ఆటగాడిపై ఇప్పుడే విపరీతమైన అంచనాలు పెంచి ఒత్తిడికి గురిచేయవద్దని, అతను మరింత ఎదిగేందుకు అభిమానులు, క్రికెట్ వర్గాలు తగిన సమయం ఇవ్వాలని హితవు పలికారు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అత్యంత పిన్న వయస్కుడిగా అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. తన దూకుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో 7 మ్యాచ్‌లలో 206కు పైగా స్ట్రైక్ రేట్‌తో 252 రన్స్ చేసిన వైభవ్.. తాజా ఐపీఎల్ 2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ప్రతిష్టాత్మకమైన ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. ఈ అద్భుతమైన ఫామ్ కారణంగానే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల కోసం తొలిసారిగా అతనికి భారత జట్టు నుండి పిలుపు వచ్చింది.
వైభవ్ టాలెంట్‌ను చూసి దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ సైతం భారత్ ఈ కుర్రాడిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఒక గొప్ప ప్లేయర్‌ను కోల్పోతుందని హెచ్చరించడం విశేషం. స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన కపిల్ దేవ్.. టీ20 క్రికెట్ పరంగా వైభవ్ ఆటతీరు అద్భుతంగా ఉన్నప్పటికీ, అసలైన పరీక్ష టెస్ట్ క్రికెట్ లాంటి సుదీర్ఘ ఫార్మాట్లలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఐదు ఓవర్ల మెయిడెన్ను తట్టుకుని క్రీజులో నిలబడగలిగిన రోజే అతని టెక్నిక్, టెంపరామెంట్ ఏంటో తెలుస్తుందని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఇంత చిన్న వయసులో ఈ స్థాయి ఇంపాక్ట్ చూపించగలరని, అందుకే ఇప్పుడే అతని చుట్టూ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా ఆడనివ్వాలని కపిల్ దేవ్ సూచించారు.








