రెండు దశాబ్దాల తెగువ.. ఒక దార్శనిక గమ్యం.. రేవంత్ రెడ్డి రాజకీయ విశ్వరూపం
రాజకీయాల్లో వారసత్వ వృక్షాల నీడన ఎదగడం ఒకెత్తయితే, ఏ శక్తీ లేని చోట తనే ఒక శక్తిగా రూపాంతరం చెందడం మరొకెత్తు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం, 2006 జులై 4న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ప్రస్థానం ప్రారంభించిన అనుముల రేవంత్ రెడ్డి, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అరుదైన, అధ్యయన యోగ్యమైన పరిణామం. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, ఏకంగా రాష్ట్ర అత్యున్నత అధికార కేంద్రంగా మారడం వెనుక ఉన్నది కేవలం అదృష్టం కాదు.. అది అలుపెరగని పోరాటం, వైఫల్యాలకు వెన్నుచూపని తెగువ, వ్యూహాత్మక స్థితప్రజ్ఞతల సమాహారం.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైనది ఆయన ప్రదర్శించిన స్వతంత్ర వైఖరి. నాటి ఉమ్మడి జిల్లాల రాజకీయాల్లో జడ్పీ పీఠాలకు మంత్రి స్థాయి ఆధిపత్యం ఉండేది. అంగ, అర్థబలాలతో ప్రధాన పార్టీలు ఆధిపత్యం కోసం వ్యూహాలు పన్నుతున్న వేళ, మిడ్జిల్ ప్రజల మనసు గెలిచి ఇండిపెండెంట్‌గా నిలబడడం ఆయన సాహసానికి తొలి నిదర్శనం. అదే పంథాను 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించారు. ప్రలోభాలు, బెదిరింపులు రాజ్యమేలే ప్రజాప్రతినిధుల ఓటింగ్ వలయంలో ఒంటరిగా పోరాడి, భారీ మెజార్టీతో పెద్దల సభలో అడుగుపెట్టి యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచారు.
గెలిచిన అనంతరం అధికార పక్షం వైపు మొగ్గకుండా, ప్రతిపక్షంలోనే ఉండి ప్రజా సమస్యలపై గళమెత్తాలనే నిర్ణయం ఆయన రాజకీయ పరిణతికి అద్దం పట్టింది. ఆపై టీడీపీలో చేరి 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా సాధించిన వరుస విజయాలు ఆయనను అజేయ శక్తిగా మార్చాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన రాజకీయ సమీకరణాల్లో, నాటి అధికార పక్షం ప్రలోభాలకు లొంగకుండా ఒంటరి పోరాటం చేసిన ధీరుడు రేవంత్. ప్రలోభాల రాజకీయాలకు లొంగి సహచరులంతా పక్షం మారినా, ఆయన మాత్రం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రతిపక్షంలోనే నిలిచారు. పదేళ్ల పాటు ఆయన పోషించిన ఉమ్మడి శత్రువుపై ఉధృత పోరాటమే, తదనంతర కాలంలో ఆయనను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించింది. 2018 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కుంగిపోకుండా, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి తన ఉనికిని చాటారు. ఆపై కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీం లీడర్‌గా పార్టీని విజయతీరాలకు చేర్చి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి శైలి మరింత పరిణతి చెందింది. అధికారం కోల్పోయిన నేతలు ఫామ్‌హౌస్‌లకే పరిమితమవుతున్న తరుణంలో, ఈయన మాత్రం ప్రతిపక్షాల అనుభవాన్ని సైతం రాష్ట్రాభివృద్ధికి వాడుకోవాలనే విస్తృత దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘పంచాయితీ కావాలా?.. పరిష్కారం కావాలా?’ అనే స్పష్టమైన వైఖరితో కేంద్ర-రాష్ట్రాల సంబంధాల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూనే, రాష్ట ప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని సూటిగా ప్రశ్నించే ధైర్యం చూపిస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన, ఐటీఐలను సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా మార్చడం, విద్యా రంగ సంస్కరణలు ఆయన పరిపాలనా దార్శనికతకు ప్రతీకలు. రెండు దశాబ్దాల క్షేత్రస్థాయి అనుభవం, రాబోయే నాలుగు దశాబ్దాల భవిష్యత్తును నిర్దేశించే “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌గా రూపాంతరం చెందింది.
తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన మిడ్జిల్ మట్టి సాక్షిగా, రూ.350 కోట్ల భారీ అభివృద్ధి పనులతో 20 ఏళ్ల కృతజ్ఞతా జాతర జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఒక గొప్ప నిదర్శనం. అవకాశవాదం, కుట్రలు లేని పట్టుదల ఉంటే ఒక సామాన్యుడు సైతం వ్యవస్థను శాసించే స్థాయికి చేరగలడని నిరూపించిన సజీవ సాక్ష్యం రేవంత్ రెడ్డి ప్రస్థానం.








