కశ్మీర్ ఉగ్రవాదం వెనక పాక్..? పీఓకే నిరసనకారుల క్లారిటీ..!
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న నానుడి పాకిస్తాన్ కు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే కశ్మీర్ లో యువతకు ఆయుధాలు సరఫరా చేసి, ఉగ్ర శిక్షణ ఇప్పించింది పాక్. ఇదే విషయాన్ని భారత్ దశాబ్దాలుగా ప్రపంచానికి విన్నవించుకుంటూ వస్తోంది. అయితే వాటిని పాక్ తోసిపుచ్చడమే కాదు.. అది కశ్మీర్ స్వతంత్ర పోరాటమని అభివర్ణిస్తోంది. అంతేనా.. దీర్ఘకాలం పాటు తమ సపోర్ట్ వారికి ఉంటుందని పబ్లిగ్గా చెబుతోంది. అయితే.. పీఓకేలో నిరసన కారులు రీసెంట్ గా చేసిన ఓప్రకటన పాకిస్తాన్ కు.. నోటిలో ఎలక్కాయ ఇరుక్కున్నట్లైంది. ఇప్పుడు పాక్ కక్కలేక, మింగలేక అన్నట్లు ఆపసోపాలు పడుతోంది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రావలకోట్‌లోని ఈద్గా మైదానంలో నిరసన ప్రదర్శనలు తీవ్ర రూపు దాల్చాయి.ఈ మహాధర్నాకు వేలాదిగా స్థానికులు తరలివస్తున్నారు. ప్రాథమిక హక్కుల సాధన కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఇస్లామాబాద్ (పాక్ ప్రభుత్వం) నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటుగా మారింది. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన అబద్ధాలను స్థానిక నేతలు ఇక్కడి వేదికల నుంచే బయటపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.
ఈ నిరసనల్లో భాగంగా ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ) అధినేత సర్దార్ అమన్ ఖాన్ చేసిన సంచలన ప్రసంగం ఇప్పుడు పాకిస్థాన్ రక్షణ వర్గాలను వణికిస్తోంది. సరిహద్దుల్లోని కశ్మీరీలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది స్వయంగా పాకిస్థాన్ సైన్యమేనని ఆయన బహిరంగంగా వెల్లడించారు.”కశ్మీరీల చేతులకు తుపాకులు అందించింది పాకిస్థాన్ సైన్యమే. కానీ ఈ రోజు వాళ్లే మమ్మల్ని ఉగ్రవాదులు అని పిలవడానికి ఎంత ధైర్యం?” అని సర్దార్ అమన్ ఖాన్ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనకారుల నుండి పెద్ద ఎత్తున చప్పట్లు, మద్దతు లభించింది.
జైష్-ఎ-మహమ్మద్ ర్యాలీపై ప్రశ్నలు
గత ఏడాది ఫిబ్రవరిలో రావలకోట్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహమ్మద్’ నిర్వహించిన ఒక బహిరంగ ర్యాలీని అమన్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ రోజు ఉగ్రవాదులు ఏకే-47 తుపాకులు, కత్తులతో నడిరోడ్లపై యథేచ్ఛగా ఊరేగారని.. ఆ కార్యక్రమానికి రావలకోట్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా అనుమతులు ఇవ్వడమే కాకుండా, ఉగ్రవాదులకు ప్రభుత్వ రక్షణ (సెక్యూరిటీ) కూడా కల్పించారని ఆయన మండిపడ్డారు.
“డిప్యూటీ కమిషనర్ గారూ.. ఆ రోజు ఇక్కడ తుపాకులు, కత్తులతో ర్యాలీలు నిర్వహించింది మీరే, గుర్తుందా? ఇప్పుడు హక్కుల కోసం పోరాడుతున్న మమ్మల్ని ఉగ్రవాదులు అంటారా? ఈ మట్టికి అసలైన వారసులు ఇక్కడున్న ప్రజలే” అని అధికార యంత్రాంగాన్ని ఆయన నిలదీశారు.
పాకిస్థాన్ పూర్తిగా తప్పుకోవాలి!
ప్రస్తుతం పీవోకే వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిన ఈ ఉద్యమం వెనుక 38 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లను పాక్ ప్రభుత్వం తక్షణమే అంగీకరించి అమలు చేయకపోతే.. ఈ నిరసనలు కేవలం సంస్కరణలకే పరిమితం కాబోవని, ఈ ప్రాంతం నుండి పాకిస్థాన్ పూర్తిగా తప్పుకోవాలనే ఉద్యమంగా మారుతుందని అమన్ ఖాన్ హెచ్చరించారు.
అంతర్జాతీయ స్థాయికి చేరిన నిరసనలు
ఈ ప్రజా నిరసనలు కేవలం పీవోకే సరిహద్దులకే పరిమితం కాలేదు. వివిధ దేశాలలో నివసిస్తున్న కశ్మీరీ ప్రవాసులు సైతం అక్కడ ఉన్న పాకిస్థాన్ రాయబార కార్యాలయాల వెలుపల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీనివల్ల ఈ సమస్య అంతర్జాతీయ వేదికలపైకి చేరింది. రావలకోట్ ఈద్గా మైదానం నుండి వినిపిస్తున్న ఈ తిరుగుబాటు స్వరాలు ఇస్లామాబాద్‌ను తీవ్ర రక్షణ ఆత్మరక్షణలో పడేశాయి.








