The Last Move… చివరి ఎత్తు ఇరాన్దేనా? అమెరికా లెక్కలు తప్పాయా?
— సూర్య ప్రకాశ్ జోశ్యుల
రాత్రి సముద్రం నిశ్శబ్దంగా ఉంది.
రాడార్ స్క్రీన్‌పై చిన్న చిన్న చుక్కలు కదులుతున్నాయి.
అవి చేపల పడవలు కావు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మోసుకెళ్తున్న చమురు ట్యాంకర్లు.
ప్రతి నౌక ముందుకు కదిలే ముందు ఒకే ప్రశ్న అడుగుతోంది…
“ఎదర దారి సురక్షితమేనా?”
ప్రపంచ పటంలో అది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న జలసంధి.
కానీ ప్రపంచ ఇంధన సరఫరాలో అది ఒక గొంతు.
ఆ గొంతును ఎవరైనా బిగిస్తే…
మొదట నౌకలు ఆగుతాయి.
తర్వాత చమురు మార్కెట్లు వణుకుతాయి.
ఆ తర్వాత ప్రపంచ దేశాలు ఫోన్లు ఎత్తుకుంటాయి.
చివరికి…
యుద్ధం గెలిచినవాళ్లూ, ఓడిపోయినవాళ్లూ ఒకే చర్చల టేబుల్ దగ్గరికి రావాల్సి వస్తుంది.
ఇప్పుడు అదే జరుగుతోంది.
కానీ ఈ కథ ఆ జలసంధి గురించో… సముద్రం గురించో కాదు.
నాలుగు నెలల క్రితం ఇంక దీని అయ్యిపోయింది అనుకున్న ఒక దేశం… ఈరోజు ప్రపంచ శక్తులు మళ్లీ తనతో మాట్లాడే పరిస్థితిని ఎలా సృష్టించిందన్నదే ఈ కథ.
అధ్యాయం1 :
ప్రపంచం ఒక నిర్ణయం తీసుకుంది… కానీ యుద్ధం మరో నిర్ణయం తీసుకుంది.
మొదటి దాడి జరిగిన గంటల్లోనే ప్రపంచ విశ్లేషకుల మాట దాదాపు ఒకటే. ఇరాన్ అత్యున్నత నాయకత్వానికి భారీ దెబ్బ. అమెరికా విజయోత్సాహం.
“ఈ యుద్ధం ఎక్కువ రోజులు సాగదు.”
ప్రపంచం కూడా అదే నమ్మింది. కానీ యుద్ధాలు చాలా అరుదుగా మొదటి రోజు కనిపించినట్టే ముగుస్తాయి. కొన్ని రోజుల తర్వాత… క్షిపణుల కంటే ఎక్కువగా చర్చకు వచ్చింది మరో విషయం. హోర్ముజ్. ప్రపంచం ఉలిక్కిపడి చూసింది.
అధ్యాయం 2:
ప్రపంచం చూసింది యుద్ధాన్ని… మార్కెట్లు చూసింది సముద్రాన్ని.
టెలివిజన్ స్క్రీన్లపై యుద్ధం కనిపిస్తోంది. చమురు మార్కెట్ల స్క్రీన్లపై మాత్రం మరో అలర్ట్ వెలుగుతోంది. హోర్ముజ్‌లో ప్రమాదం పెరుగుతోంది. కొద్ది రోజుల్లోనే వందలాది చమురు ట్యాంకర్లు గల్ఫ్ జలాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. రోజూ వందకు పైగా నౌకలు దాటే మార్గంలో రాకపోకలు ఒక్కసారిగా కుప్పకూలాయి. షిప్పింగ్ కంపెనీలు అత్యవసర సమావేశాలు పెట్టాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగాయి. ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.
అప్పుడు ప్రపంచం గ్రహించింది…
యుద్ధం భూమిపై జరుగుతోంది. దాని ప్రభావం సముద్రంలో లెక్కించబడుతోంది అని.
అధ్యాయం 3:
అసలు ఆయుధం క్షిపణి కాదు… భౌగోళిక స్థానం
హోర్ముజ్ ఎందుకు అంత కీలకం? ఎందుకంటే ప్రపంచ చమురులో పెద్ద భాగం ఈ ఇరుకైన మార్గం గుండా ప్రయాణిస్తుంది. ఆ ప్రవాహం మందగిస్తే… చమురు మాత్రమే కాదు… ప్రపంచ సరఫరా వ్యవస్థ మొత్తం నెమ్మదిస్తుంది. అందుకే ఈ సంక్షోభంలో ప్రపంచం మరో నిజాన్ని గుర్తు చేసుకుంది. ఆధునిక యుద్ధాల్లో కొన్నిసార్లు ఆయుధాల కంటే… సరఫరా మార్గాలే ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తాయి.
అధ్యాయం 4:
యుద్ధం గెలవడం ఒకటి… యుద్ధం తర్వాత అవసరమవడం మరోటి నెలలు గడిచాయి. కాల్పులు తగ్గాయి. కానీ ప్రపంచ సమస్యలు తగ్గలేదు. చమురు మళ్లీ ఎలా ప్రవహించాలి? సముద్ర భద్రత ఎలా ఉండాలి? అణు కార్యక్రమంపై ముందడుగు ఎలా పడాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే… ఇరాన్‌ను పక్కన పెట్టడం అసాధ్యమైంది.
అక్కడే ప్రపంచం తన లెక్కలను మార్చుకుంది. యుద్ధభూమిలో బలహీనపడిందనుకున్న దేశం.. దౌత్య చర్చల్లో తప్పనిసరి భాగస్వామిగా మారింది. అదే ఈ కథలో అసలు మలుపు.
అధ్యాయం 5:
ప్రపంచాన్ని వణికించింది చమురు కాదు… అనిశ్చితి చమురు ధరలు పెరగడం మార్కెట్లకు కొత్త విషయం కాదు. కానీ ఎంతకాలం పెరుగుతాయో తెలియకపోవడమే అసలు భయం. హోర్ముజ్ ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది? మళ్లీ మూసుకుపోతుందా? ప్రపంచ ఇంధన సరఫరా మళ్లీ దెబ్బతింటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడమే ప్రపంచాన్ని ఎక్కువగా కలవరపెట్టింది.
అధ్యాయం 6:
అసలు నిర్ణయం ఇంకా మిగిలే ఉంది
తాత్కాలిక కాల్పుల విరమణ వచ్చింది. నౌకలు మళ్లీ ప్రయాణిస్తున్నాయి. మార్కెట్లు కొంత శాంతించాయి. కానీ అసలు ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తు ఏమిటి?
హోర్ముజ్‌పై దీర్ఘకాలిక భద్రత ఎలా ఉంటుంది? ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగుతాయా? ఇవేవీ ఇంకా పూర్తిగా తేలలేదు.
భారత్‌కు ఈ కథ ఎందుకు ముఖ్యం?
ఈ కథ మధ్యప్రాచ్యంలో మొదలైంది. కానీ అక్కడితో ముగియదు. భారత్‌కు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ నుంచే వస్తుంది. అందుకే హోర్ముజ్‌లో ప్రతి ఉద్రిక్తత… దిగుమతి వ్యయాన్ని ప్రభావితం చేయగలదు. రవాణా ఖర్చులను పెంచగలదు. ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తీసుకురాగలదు.
కొన్ని రోజుల తర్వాత… దాని ప్రభావం పెట్రోల్ బంక్‌లో కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఇది దూర దేశాల రాజకీయ కథ కాదు. మన ఆర్థిక వ్యవస్థతో కూడా నేరుగా ముడిపడిన కథ.
చివరి సీన్… ఇంకా ‘కట్’ చెప్పలేదు
హోర్ముజ్ మీదుగా నౌకలు మళ్లీ ప్రయాణిస్తున్నాయి.
రాడార్ స్క్రీన్లపై చుక్కలు మళ్లీ కదులుతున్నాయి.
చమురు మళ్లీ ప్రపంచ మార్కెట్ల వైపు వెళ్తోంది.
బయటికి చూస్తే… అన్నీ మామూలుగానే కనిపిస్తున్నాయి. ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. కానీ యుద్ధాల్లో అత్యంత ప్రమాదకరమైన నిశ్శబ్దం… కాల్పులు ఆగిన తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే క్షిపణులు ఎంత నష్టం చేశాయో చరిత్ర చెబుతుంది. కానీ చర్చల టేబుల్ దగ్గర ఎవరు పైచేయి సాధించారో… అదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఈసారి ప్రపంచం ఏ ఒక్క దేశాన్ని మాత్రమే గమనించడం లేదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరి తీసుకునే 33 కిలోమీటర్ల ఆ సముద్ర దారిని కూడా గమనిస్తోంది.ఎందుకంటే…
తర్వాతి అల ఎప్పుడు ఎగుస్తుందో ఎవరికీ తెలియదు.








