ఇరాన్ టాప్ లీడర్లను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్.. లీక్ చేసిన అమెరికా..!
ఇరాన్ తో శాంతి చర్చల కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారిని ఏదో విధంగా ఒప్పించేందుకు అగ్రరాజ్యం తాపత్రయ పడుతోంది. అయితే దీన్ని ఇజ్రాయెల్ జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ చర్చలను భగ్నం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఇరాన్ టాప్ లీడర్లను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందని అంతర్జాతీయ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ బయటపెట్టింది. ఇరాన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఇద్దరు అత్యున్నత స్థాయి ప్రతినిధులను హతమార్చడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా.. పశ్చిమాసియా దేశాల ద్వారా ఇరాన్‌ను వెంటనే అప్రమత్తం చేసిందని వెల్లడించింది.
ఏప్రిల్ 12న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఇస్లామాబాద్ (పాకిస్థాన్)లో చర్చలు ముగించుకుని తిరిగి ఇరాన్ వస్తుండగా హఠాత్ పరిణామం చోటు చేసుకుంది.. ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని అడ్డుకుని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించాయి. ఈ నిఘా సమాచారాన్ని అమెరికా సాయంతో పసిగట్టిన ఇరాన్ రక్షణ వర్గాలు.. గాలిబాఫ్ విమానాన్ని వెంటనే ఈశాన్య ఇరాన్‌లోని ‘మషద్’ నగరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించాయి. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి 8 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సురక్షితంగా టెహ్రాన్ చేరుకున్నారు. గాలిబాఫ్ గతంలో జరిగిన దాడుల శిథిలాల నుంచి కూడా రెండుసార్లు ప్రాణాలతో బయటపడటం గమనార్హం.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చర్చల కోసం ముందుకొచ్చిన అలీ లారిజానీ, కమల్ ఖరాజీలను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. అయితే ఏప్రిల్ నుంచి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం (జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ వంటి ప్రతినిధులతో) ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించాక.. ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక రాయబారులైన అరాఘ్చీ, గాలిబాఫ్‌లను కూడా చంపేస్తే చర్చలు పూర్తిగా ఆగిపోయి, మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని ఇజ్రాయెల్ భావించింది.
ఇరాన్లో అధికార మార్పిడి జరగాలని, వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ పట్టుబడుతుండగా.. అమెరికా మాత్రం హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, అణు నియంత్రణపై ఒక శాంతి ఒప్పందాన్నికుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ భిన్నమైన వ్యూహాల కారణంగానే అమెరికా, ఇజ్రాయెల్‌ను పక్కనపెట్టి ఇరాన్‌కు రహస్యంగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని చేరవేసి వారి రాయబారులను కాపాడాల్సి వచ్చింది. ఈ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, మే నెలలో ఖతార్, జూన్‌లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన శాంతి చర్చలలో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనడం గమనార్హం.








