‘సేవ్ ది టైగర్స్ 3’ వెబ్ సీరిస్ రివ్యూ – మల్టీవర్స్‌తో మ్యారేజ్ కౌన్సెలింగ్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating : 2.75/5
అంతకు ముందు వచ్చిన సీరిస్ ని కంటిన్యూ చేస్తూ రాహుల్ (అభినవ్ గోమఠం),గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) భార్యలతో నిరంతరం యుద్దాలు చేస్తూంటారు. కొన్ని తెలిసి, మరికొన్ని తెలియక చేసిన వెదవ్వేషాలు పెద్దవై వాళ్ల భార్యల దృష్టిలో పర్మనెంట్ గా ఎదవల్లాగా ముద్రపడతారు. దాంతో ఆ పోటు తట్టుకోలేక వాళ్లు రివర్స్ గేర్ స్టార్ట్ చేస్తారు. దాంతో రెచ్చిపోతున్న పెళ్లాల బారినుంచి తప్పించుకోలేక బార్ పాలవుతారు. ఓ పెగ్గేసి తమ ప్రస్ట్రేషన్ ని దింపుకుందామనుకుంటారు. ఆ క్రమంలో తాగి నోటికొచ్చిందల్లా వాగుతూంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో అవుతాయని చెప్పిందెవరు అని దేవుడ్ని సైతం తిట్టిపోయటం మొదలెడతారు.
ఆ బూతులు బాకుల్లా స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్)ని తాకుతాయి. దాంతో ఆయన తన అసెస్టెంట్ గుప్తా (గుండు సుదర్శన్)ని పిలిచి ఈ సొల్లు బ్యాచ్ కు ఓ సొల్యూషన్ చూడమని పురమాయిస్తాడు. గుప్తా కాసేపు గుండు రాసుకుని..సర్లే వీళ్ళకు ఏం చెప్పినా వినే బ్యాచ్ కాదు అని అర్దం చేసుకుని, చిన్న ట్రిక్ తో బుద్ధి చెప్దామనుకుంటాడు.
అందుకోసం మల్టీవర్స్ కాన్సెప్టుని ఆశ్రయిస్తాడు. సేమ్ ఇలాంటి ముగ్గురే మరో లోకంలో ఉంటే వారిని ఇక్కడికి…వీళ్లను అక్కడికి షిప్ట్ చేస్తాడు. అలా ప్లేస్ లు మారిన వీళ్లు …బుద్దులు మారి బుద్ది మంతులయ్యారా…మరింత బుడ్డి మంతులయ్యారా… ఫైనల్ గా ఏం జరిగింది…వీళ్ల సంసారాలు ఇంద్రుడు చలువతో చక్కబడ్డాయా అనేది తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.
ఎనాలసిస్:
సినిమా అయినా, సీరిస్ అయినా మనం రిలేట్ అవ్వాలి. ఆ పాత్ర మనమే అనుకోవాలి. అప్పుడే అది పండుతుంది. సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్లు “మన ఇంట్లో జరిగే కథ”ను చెప్పాయి. అందుకే ప్రేక్షకుడు పాత్రలను చూసి నవ్వలేదు… తనను తాను చూసి నవ్వుకున్నాడు. అదే ఈ ఫ్రాంచైజీ అతిపెద్ద బలం.
ముఖ్యంగా మూడో సీజన్ వచ్చేసరికి రచయితలు ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. రోజువారీ కుటుంబ కామెడీని వదిలి, ప్యారలల్ వరల్డ్ అనే ఫాంటసీ కాన్సెప్ట్‌లోకి వెళ్లారు. ఒక ఫ్రాంచైజీకి ఇది సహజమైన పరిణామమే. ఎందుకంటే ఒకే సమస్యలను, ఒకే జోకులను మూడోసారి చెబితే ప్రేక్షకుడికి విసుగు వస్తుంది. అందుకే కొత్త “ఇంజిన్” కావాలి. ఇక్కడ ఆ ఇంజిన్… మల్టీవర్స్.
హాలీవుడ్లో స్క్రీన్‌రైటర్లు తరచూ ఓ మాట చెప్తూంటారు. “High Concept attracts the audience. Emotional truth keeps them watching.” అంటే… కొత్త ఐడియా ప్రేక్షకుడిని థియేటర్‌కి లేదా ఓటీటీకి తీసుకొస్తుంది. కానీ చివరి ఎపిసోడ్ వరకు కూర్చోబెట్టేది భావోద్వేగమే.
అలా చూస్తే ఈ సీజన్లో Parallel World అనేది అద్భుతమైన హుక్. “మరో ప్రపంచంలో నా జీవితం ఎలా ఉండేది?” ఈ ప్రశ్నే ఆసక్తిని పెంచేస్తుంది. అయితే ఆ ఎపిసోడ్స్ కు వెళ్లిన తర్వాత కథ ఎక్కువసేపు ప్రపంచాల మధ్య తేడాలను చూపించడంపైనే దృష్టి పెడుతుంది.
ఎక్కడ మనకు అర్దం కాదేమో అని అక్కడక్కడే ఎక్కువ సేపు నడుస్తుంది. దాంతో ఆ ప్రపంచం ప్రధాన పాత్రలను ఎలా మార్చుతోంది? వారి అంతర్గత సంఘర్షణ ఎలా పెరుగుతోంది? అనే అంశాలు చూపటానికి తక్కువ సమయం దొరుకుతుంది. అందుకే కాన్సెప్ట్ పెద్దది… కానీ భావోద్వేగ ప్రయాణం అంత పెద్దగా అనిపించదు.
స్క్రీన్‌ప్లేలో మొదటి యాక్ట్ మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. హీరోలు సమస్యలు స్థాపిస్తారు. ఫ్రస్ట్రేషన్‌ను పెంచుతారు. దేవలోకాన్ని పరిచయం చేస్తారు. ప్రపంచ మార్పిడి ట్విస్ట్ ఇస్తారు. అంటే… Inciting Incident చాలా త్వరగా వస్తుంది. దాంతో ప్రేక్షకుడు వెంటనే కథలోకి వెళ్తాడు. ఇది స్క్రీన్‌ప్లేకు పెద్ద ప్లస్.
అయితే రెండో యాక్ట్‌లో బిగుతు తగ్గింది . మల్టీవర్స్ రూల్స్ ప్రేక్షకుడికి అర్థమైన తర్వాత కూడా కథ అదే విషయాన్ని వేర్వేరు సన్నివేశాల్లో తిరిగి చూపిస్తుంది. పాత్రలు కదులుతున్నాయి…సీన్స్ మారుతున్నాయి… కానీ కథ మాత్రం ముందుకు వెళ్లడం లేదు. చూసే మనకి “ఇది నాకు ఇప్పటికే తెలుసు”మళ్లీ ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది. అక్కడే పేసింగ్ పడిపోతుంది. అలాగే ఈ సీరిస్ లో చూపించాల్సిన చోట చెప్పేశారు.
కామెడీ పండిందా?
మొదటి రెండు సీజన్లలో నవ్వు… Character Behaviour నుంచి పుట్టేది. ఈసారి… చాలా చోట్ల… Situation నుంచి పుట్టేలా ప్రయత్నించారు. అందుకే కొన్ని జోకులు సహజంగా కాకుండా రాసినట్టుగా అనిపిస్తాయి.
వెన్నెల కిషోర్… ఒక మిస్ అయిన అవకాశం
ఇంద్రుడి పాత్ర కథలో కీలక మలుపుకు కారణం. కానీ ఆ పాత్ర కథను ముందుకు నడిపే శక్తిగా కాకుండా… మధ్య మధ్యలో వచ్చి రిమైండర్ ఇచ్చే పాత్రగా మాత్రమే మిగిలిపోతుంది. మిగతా పాత్రల్లో కనిపించిన అభినవ్, చైతన్య కృష్ణ, ప్రియదర్శిలు ఈసారి బాగా చేసారు. భార్యలుగా సుజాత, దేవయాని శర్మ, పావని తమ టాలెంట్ మొత్తం చూపించేసారు.
ఐడియా కొత్తదా?
ఈ కాన్సెప్ట్‌ను ప్రపంచ సినిమా ఎన్నోసార్లు వాడింది. కానీ ప్రతిసారి ఉద్దేశ్యం వేరు.
Sliding Doors — ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని ఎంతగా మార్చుతుందో.
Coherence — ఒకే వ్యక్తి ఎన్నో రూపాల్లో ఎదురైతే వచ్చే మానసిక గందరగోళం.
Everything Everywhere All at Once — అనేక విశ్వాల మధ్య ప్రయాణం చేస్తూనే, తల్లి-కూతురు బంధాన్ని కేంద్రంగా ఉంచింది. మల్టీవర్స్ అక్కడ కేవలం విజువల్ గిమ్మిక్ కాదు; భావోద్వేగానికి రూపకం.
Run Lola Run — చిన్న మార్పులు జీవిత ఫలితాలను ఎలా మార్చుతాయో రిథమ్‌తో చూపించింది.
It’s a Wonderful Life — “నువ్వు లేకపోతే ప్రపంచం ఎలా ఉండేది?” అనే ప్రత్యామ్నాయ వాస్తవాన్ని ఉపయోగించి జీవిత విలువను గుర్తు చేసింది.
సేవ్ ది టైగర్స్ 3 వీటిలా భారీ తాత్విక చర్చ చేయదు. దీని లక్ష్యం చాలా సరళం. “భార్య మారితే జీవితం బాగుపడుతుందా? లేక మనమే మారాలా?” అన్నదే.
ఫైనల్ ధాట్..:
స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే సేవ్ ది టైగర్స్ 3 ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీ. మధ్యతరగతి దాంపత్య జీవితంలోని చిన్న చిన్న అసంతృప్తులను, “అవతల గడ్డి పచ్చగా ఉంటుంది” అనే మనస్తత్వాన్ని మల్టీవర్స్ రూపకంతో చెప్పాలన్న ప్రయత్నం మాత్రం ప్రశంసించదగ్గది.
ఎక్కడ చూడచ్చు?
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.








