మ్యూజిక్ డైరెక్టర్ కాదు.. బ్రాండ్‌గా మారిన అనిరుధ్ రవిచందర్
ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాల సక్సెస్‌లో హీరో, దర్శకుడు, విజువల్ గ్రాండియర్ మాత్రమే ప్రధాన ఆకర్షణలుగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా మారిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక కూడా భారీ ప్రాజెక్టుల సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మార్పుకు అత్యంత పెద్ద ఉదాహరణగా అనిరుధ్ రవిచందర్ నిలుస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్(Anirudh) ఒక్కో సినిమాకు సుమారు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్ర్ గా అనిరుధ్ పేరు వినిపిస్తోంది. ఆయన మ్యూజిక్ కు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా భారీ మొత్తాలు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు.
తెలుగు చిత్రసీమలో అనిరుధ్ డిమాండ్ ఏ స్థాయికి చేరుకుందో ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులే చెబుతున్నాయి. అల్లు అర్జున్(Allu Arjun)- లోకేష్ కనగరాజ్(LOkesh kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కుతున్న AA23, బాలకృష్ణ(balakrishna)- కొరటాల శివ(koratala Siva) కాంబోలో రూపొందుతున్న NBK112, ఎన్టీఆర్(NTR)- త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ప్రతిష్టాత్మక మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్(God Of war) వంటి భారీ సినిమాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు కలిగినవే కావడం విశేషం. ముఖ్యంగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ సినిమాలపై రిలీజ్ కు ముందే భారీ హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
కోలీవుడ్ లోనూ దాదాపు ప్రతి అగ్ర హీరో, ప్రముఖ నిర్మాణ సంస్థకు అనిరుధ్ తొలి ఎంపికగా కొనసాగుతున్నారు. ఆయన మ్యూజిక్ ఉన్న సినిమాల ఆడియో హక్కులకు మ్యూజిక్ లేబుల్స్ భారీ మొత్తాలు చెల్లించేందుకు ముందుకు వస్తుండటంతో, అనిరుధ్ కూడా తన రెమ్యూనరేషన్ ను అదే స్థాయిలో నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఆసక్తికరంగా, ఆయన రెమ్యునరేషన్ దక్షిణాది సినీ పరిశ్రమలోని పలువురు యంగ్ హీరోల రెమ్యూనరేషన్ ను కూడా అధిగమించిందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో డిమాండ్, పారితోషికం, వరుస భారీ ప్రాజెక్టుల పరంగా చూస్తే అనిరుధ్ రవిచందర్‌కు సమీపంలో నిలిచే మరో మ్యూజిక్ డైరెక్టర్ కనిపించడం లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.







