శ్రీరామ్ (శ్రీకాంత్) ఔట్ స్టాండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి రివర్స్ టీజర్ రిలీజ్
తొలిసారి రివర్స్ టీజర్ తో సరికొత్త ప్రయత్నం చేసి ఆకట్టుకుంటున్న “ది మేజ్” మూవీ మేకర్స్
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా “ది మేజ్”. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. “ది మేజ్” చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు “ది మేజ్” సినిమా నుంచి రివర్స్ టీజర్ రిలీజ్ చేశారు. తొలిసారి రివర్స్ టీజర్ తో ఒక సరికొత్త ప్రయత్నం చేసి ఆకట్టుకుంటున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాతలు.
“ది మేజ్” సినిమా రివర్స్ టీజర్ ఎలా ఉందో చూస్తే – ‘కన్ను మూసి తెరిచే సరికి ఈ ప్రపంచం అతన్ని గతాన్ని మాయం చేసింది..; అతను మాత్రమే నమ్మే నిజాన్ని కలగా మార్చేసింది…’ అని చెబుతూ ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమవుతుంది. నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచిన హీరో మదిలో అనేక సంఘటనలు మెదులుతుంటాయి. ఎవరూ నమ్మని, తను మాత్రమే నమ్మే కొన్ని నిజాలు, వాటి రుజువుల కోసం అతను అన్వేషణ సాగిస్తుంటాడు. కొంతమంది వ్యక్తులను వెంబడిస్తుంటాడు. హీరో భ్రమపడుతున్నాడని ఇతరులు అనుకున్నవి నిజంగా భ్రమలేనా ?, లేక హీరో బలంగా నమ్మినట్లు వాస్తవాలా ? ఈ సందిగ్ధ పరిస్థితులకు కారణం ఎవరు?, ఈ ప్రయాణంలో హీరోను నమ్మి వెనక అండగా ఎవరు నిలబడ్డారు? అతను ఎలా గాయపడ్డాడు? హత్యల్ని ఆపే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఎవరి కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది? వంటి అంశాలు టీజర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. టీజర్ చివరలో హీరోను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండటం మరింత ఆసక్తి రేపుతోంది. టీజర్ చివరి సీన్ తప్ప మొత్తం రివర్స్ లో ఉండటం ఒక సరికొత్త ప్రయత్నంగా చెప్పవచ్చు. మొత్తంగా ఈ రివర్స్ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది.








