శాన్ జోస్‌లో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్… సంగీతంతో హోరెత్తించిన డీఎస్పీ
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోస్ నగరంలో ప్రవాస తెలుగు సమాజం మునుపెన్నడూ లేని విధంగా సంగీత సాగరంలో తేలియాడింది. సంగీత దర్శకుడు, సింగర్, నటుడు, స్టేజ్ పర్ఫార్మర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ శాన్ జోస్ సివిక్ ఆడిటోరియంలో అత్యంత అట్టహాసంగా జరిగింది. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ (BAE), ప్రముఖ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య , అపెక్స్ (APEX) కన్సల్టింగ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ టిక్కెట్లన్నీ పూర్తిగా అమ్ముడైపోయి (Sold-Out).. వేలాది మంది సంగీత ప్రియుల మధ్య ఒక చారిత్రక ఉత్సవంలా సాగింది.
డీఎస్పీ స్టేజ్‌పైకి అడుగుపెట్టిన తొలి క్షణం నుంచే తనదైన ఎనర్జీతో, అద్భుతమైన చార్ట్‌బస్టర్ పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనలో ఆయన ఏమాత్రం అలసట లేకుండా పాడుతూ, డాన్స్ చేస్తూ, ప్రేక్షకులతో ముచ్చటిస్తూ పవర్‌హౌస్ పర్ఫార్మెన్స్లతో హోరెత్తించారు. ఈ మరపురాని సంగీత రాత్రిలో రాక్‌స్టార్ డీఎస్పీతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకులు కార్తీక్, సమీరా భరద్వాజ్, రీటా, సాగర్ , ప్రతిభావంతులైన డాన్సర్లు బృందం అంతా కలిసి స్టేజ్‌పై సరికొత్త వెలుగులు నింపారు.
ఇవి కూడా చదవండి
‘ఎల్లమ్మ’ సినిమాతో నటుడిగా..
ఈ సంగీత విభావరి వేదికగా దేవి శ్రీ ప్రసాద్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో రాబోతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం ద్వారా తాను వెండితెరకు నటుడిగా పరిచయమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. 1999లో సంగీత దర్శకుడిగా తన మొదటి సినిమా ‘దేవి’ అమ్మవారి పేరుతోనే ప్రారంభమైందని, ఇప్పుడు నటుడిగా తన మొదటి సినిమా కూడా ‘ఎల్లమ్మ’ అమ్మవారి చుట్టూనే సాగడం విశేషమని అన్నారు. ఈ సరికొత్త అధ్యాయం కూడా అంతే విజయవంతం అవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరచగా, ఆడిటోరియంలోని వేలాది మంది అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
2008 నుండి తాను అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతి మ్యూజికల్ టూర్లోనూ శాన్ జోస్ నగరం ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందని, దీనికి బాటా, బే ఏరియా తెలుగు కమ్యూనిటీ అందిస్తున్న అచంచలమైన మద్దతే కారణమని డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సుదీర్ఘ అనుబంధం కారణంగానే ఇక్కడి ప్రతి ప్రదర్శన ఒక మరపురాని వేడుకగా మారుతోందని కొనియాడారు. 120కి పైగా సినిమాలు, 800లకు పైగా పాటల ప్రయాణంలో క్లాసిక్ మెలోడీల నుండి మాస్ బీట్ల వరకు డీఎస్పీ అందించిన ప్రతి పాట ప్రేక్షకులను ఆద్యంతం ఉర్రూతలూగించింది.
సమష్టి కృషితో ఈవెంట్ ఘన విజయం
ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక బాటా టీమ్ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారుల నెలల తరబడి శ్రమ, అంకితభావం దాగి ఉన్నాయి. పకడ్బందీ ప్రణాళికతో వరల్డ్-క్లాస్ వినోదాన్ని అందించిన ఆర్గనైజింగ్ టీమ్‌ను అందరూ అభినందించారు. ఈ ప్రదర్శనకు మద్దతుగా నిలిచిన ప్లాటినం స్పాన్సర్లు సౌజన్య అనుబోతు (SS Realty), ఎక్స్‌ప్యాట్ మనీ (Xpat.Money), గోల్డ్ స్పాన్సర్స్ అమోఘం ఇండియన్ క్విజిన్, సిల్వర్ స్పాన్సర్స్ కావ్య ఫుడ్స్, ఇన్‌స్టా సర్వీస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థలకు కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
బాటా నిర్వాహకులు మాట్లాడుతూ… ఈ కాన్సర్ట్ కేవలం ఒక సంగీత ప్రదర్శన మాత్రమే కాదని, తెలుగు సంస్కృతి, కమ్యూనిటీ , సంగీత సార్వజనీన భాషకు దక్కిన ఉత్సవమని కొనియాడారు. వేలాది మంది అభిమానులు ఒకే చోట పాడుతూ, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం చూడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. స్టేజ్‌పై అద్భుతంగా రాణించిన రుద్ర డాన్స్ అకాడమీ (న్యూజెర్సీ), మచ్చా స్వాగ్ టీమ్ డాన్సర్లకు , మీడియా పార్ట్నర్ అయిన ‘తెలుగు టైమ్స్’ సహా తదితర సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి పాట ముగిశాక ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్‌తో సంగీత రాత్రి మరుపురాని అనుభూతిని నింపింది.
ఇవి కూడా చదవండి
ఈ ఈవెంట్‌కి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…








