ప్యారడైజ్ వల్ల రెండు క్రేజీ ప్రాజెక్టులను వదులుకున్న నాని
నేచురల్ స్టార్ నాని(Nani) కెరీర్లో ఇప్పటివరకు ఫాస్ట్ ప్లానింగ్ తో సినిమాలను పూర్తి చేస్తూ వచ్చిన హీరోగా గుర్తింపు పొందాడు. రిలీజ్ డేట్స్ ను ముందుగానే అనౌన్స్ చేసి వాటిని దాదాపు ఎలాంటి వాయిదాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆయన స్పెషాలిటీగా నిలిచింది. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(The Paradise) విషయంలో పరిస్థితులు భిన్నంగా మారాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు బడ్జెట్ కూడా పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేయడంపైనే నాని పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేసే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ ఆలస్యం కారణంగా నాని లైనప్‌లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న(Hi Nanna) డైరెక్టర్ శౌర్యువ్(Shouryuv) రెడీ చేసిన కొత్త కథకు నాని ఆసక్తి చూపినా, వచ్చే రెండేళ్ల వరకు డేట్లు ఖాళీగా లేకపోవడంతో మరో హీరోతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జై భీమ్(Jai Bhim) డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(TJ Gnanavel)తో కూడా నాని ఓ సినిమా చేయాలనుకున్నప్పటికీ, డేట్ల సమస్య కారణంగా ఆ ప్రణాళిక తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నాని వద్దకు మరికొన్ని కొత్త కథలు చేరుతున్నప్పటికీ, ఏ ప్రాజెక్ట్‌కు కూడా స్పష్టమైన కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ముందుగా ది ప్యారడైజ్ పూర్తి చేయడమే ఆయన ప్రాధాన్యతగా భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ సుజీత్(Sujeeth)తో బ్లడీ రోమియోను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 సమ్మర్ సీజన్లో విడుదల చేయాలనే ప్రాథమిక ప్రణాళికతో మేకర్స్ ముందుకు సాగుతున్నట్లు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.








