మర్డర్ మిస్టరీ: “ది సమురాయి అండ్ ది ప్రిజనర్” మూవీ రివ్యూ:
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్: 3/5
యుద్ధం నేపథ్యంలో జరిగే ప్రతి సినిమాలోనూ యుద్ధమే ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అసలు యుద్ధం కోట గోడల బయట కాదు… ఆ కోట గోడల మధ్య జరుగుతూంటుంది. ఎవరు మనవాళ్లు? ఎవరు శత్రువులు? ఒక మరణం ప్రమాదమా, హత్యా? భయం మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుంది? “ది సమురాయి అండ్ ది ప్రిజనర్” ఇలాంటి ప్రశ్నలతో ఒక సమురాయి యుగంలోని కోట తలుపులు తెరుస్తుంది.Martin Scorsese వంటి అనేక మంది దర్శకులు మాస్టర్ పీస్ అని మెచ్చుకున్న ఈ సినిమాలో ఏముంది చూద్దాం.
కథ
కథ 1578లో జపాన్‌లో జరుగుతుంటుంది. అది జపాన్ చరిత్రలో వివిధ ప్రాంతాల పాలకులు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటున్న కాలం. 16వ శతాబ్దపు జపాన్‌లో మనం ఇప్పుడు అర్థం చేసుకునే విధంగా ఒకే దేశానికి ఒకే రాజు పూర్తిస్థాయిలో పాలించే పరిస్థితి లేదు. అనేక ప్రాంతాలను డైమ్యోలు (Daimyō) అనే శక్తివంతమైన సమురాయి ప్రభువులు పాలించేవారు.
అలాంటి డైమ్యోలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకడు ఒడా నొబునాగా. అతడు ప్రధాన సమురాయి యుద్ధాధికారి. అంటే తన సైనిక శక్తితో అనేక ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించుకుని, ఇతర ప్రాంతీయ డైమ్యోలను తన వైపు తిప్పుకున్న శక్తివంతమైన పాలకుడు.
అతడి ఆధీనంలో లేదా అతడికి విధేయులుగా ఉన్న ప్రాంతీయ డైమ్యోలు, అంటే సామంత ప్రభువులు చాలామంది ఉండేవారు. వారిలో ఒకడు అరాకి మురాషిగే. ఒకప్పుడు నొబునాగాకు విధేయుడిగా ఉండి, అతడి తరఫున యుద్ధాలు చేసిన మురాషిగే, 1578లో అకస్మాత్తుగా అతడిపైనే తిరుగుబాటు చేశాడు.
అయితే నొబునాగా లాంటి శక్తివంతమైన వ్యక్తికి ఎదురుగా నిలబడటం అంటే దాదాపు ఆత్మహత్యతో సమానం. అయినప్పటికీ మురాషిగే వెనక్కి తగ్గడు. తన కోటలోనే ఉండి ప్రతిఘటించాలని నిర్ణయించుకుంటాడు.
వెంటనే నొబునాగా సైన్యం ఆ కోటను ముట్టడిస్తుంది.
కోట బయట యుద్ధం ముదురుతున్న సమయంలో, నొబునాగా తరఫున కాన్బే కురొడా అనే వ్యక్తి మురాషిగే వద్దకు వస్తాడు. కాన్బే సాధారణ దూత కాదు. అతడు చాలా తెలివైన వ్యూహకర్త. మురాషిగేను ఒప్పించి లొంగిపోయేలా చేయడమే అతడి పని. అయితే మురాషిగే లొంగడానికి నిరాకరిస్తాడు. అంతేకాదు, కాన్బేను కూడా తిరిగి వెళ్లనివ్వడు. కాన్బేను చంపకుండా, విడిచిపెట్టకుండా కోటలోని ఒక చీకటి చెరసాలలో బంధిస్తాడు.
ఇక్కడి వరకు కథ ఒక సాధారణ యుద్ధ డ్రామాలా నడుస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది.
కోటలో ఉన్నవాళ్లకు బయట ఉన్న శత్రువు ఎవరో తెలుసు. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. కోట ముట్టడి మొదలైన కొద్దిరోజులకే కోట లోపలే ఒక భయంకరమైన సమస్య మొదలవుతుంది.
ఒక ప్రముఖ యుద్ధాధికారి చిన్న కొడుకు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. అతడి తండ్రి ఇటీవలే నొబునాగా పక్షాన చేరిపోయిన వ్యక్తి కావడంతో, చాలామంది దీనిని దేవుడి శిక్షగా భావిస్తారు. కానీ ఆ పిల్లాడు చనిపోయిన విధానం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. అతడిని ఒక సన్నని సందు గుండా బాణంతో కొట్టినట్లు కనిపిస్తుంది. అది నిజంగా మనిషి చేయగలిగిన పని కాదేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది.
అక్కడితో ఈ వరుస మరణాలు ముగియవు. రోజులు గడుస్తున్న కొద్దీ కోటలో మరికొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత ఒక యోధుడు, ఒక మత గురువు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతారు.ఇవి రెండు వేర్వేరు హత్యలా? లేక రెండూ ఒకే కుట్రలో భాగమా? అనేది అర్థం కాదు.
ఇదిలా ఉండగా, ఓ రోజు కోటలో అందరూ చూస్తుండగానే ఒక యోధుడు పిడుగుపాటుకు గురవుతాడు. అది నిజంగానే ప్రకృతి చేసిన ప్రమాదమా? లేక ఈసారి కూడా ఎవరో పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ప్రతి కొత్త మరణంతో కోటలోని భయం మరింత పెరుగుతుంది. “ఇది దేవుడి శాపం” అని కొందరు నమ్మడం మొదలుపెడతారు. మరికొందరు కోటలోనే ఎవరో ఒకరు అందరినీ ఆటాడిస్తున్నారని అనుమానిస్తారు.
ఈ పరిస్థితిలో మురాషిగే ఈ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. అయితే తన దగ్గర ఉన్నవాళ్లలో ఎవ్వరికీ ఆ శక్తి లేదని అర్దం అవుతుంది. అప్పుడు అతడికి గుర్తుకొచ్చేది చెరసాలలో ఉన్న కాన్బే. అతడు శత్రువు మనిషి. దానికి తోడు తన ఖైదీ. అయినా అసాధారణమైన తెలివి ఉన్న వ్యక్తి.
చివరకు మురాషిగే కాన్బే సహాయం కోరాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కోట యజమాని మురాషిగే… చెరసాలలో బంధించిన తన శత్రువు కాన్బే మేధస్సుపై ఆధారపడాల్సి వస్తుంది. కాన్బే ఒక్కో కేసును పరిశీలించడం మొదలుపెడతాడు.
అయితే అతడు కేవలం “హంతకుడు ఎవరు?” అంటూ విచారణ చేయడు. ప్రతి మరణం వెనుక ఉన్న రాజకీయాలు, వ్యక్తిగత పగలు, యుద్ధ భయాలు, మత విశ్వాసాలను కూడా పరిశీలిస్తాడు. ఒకవైపు కోట బయట నొబునాగా సైన్యం ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు కోట లోపల వరుసగా జరుగుతున్న ఈ రహస్య మరణాలు అక్కడున్న ప్రతి ఒక్కరి నమ్మకాలను కూల్చేస్తున్నాయి.
ఈ పరిస్థితిలో మురాషిగే నిజంగా తన కోటను కాపాడుకోగలిగాడా? కాన్బే నిజంగానే అతడికి సహాయం చేస్తున్నాడా? లేక తన ఖైదీ పరిస్థితిని కూడా ఉపయోగించుకుని మరో ఆట ఆడుతున్నాడా? అసలు ఈ వరుస మరణాల ఎవరు ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “ది సమురాయి అండ్ ది ప్రిజనర్” సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్
“ది సమురాయి అండ్ ది ప్రిజనర్” కథకు జపాన్ ప్రేక్షకులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రముఖ జపాన్ రచయిత హోనోబు యోనెజావా రాసిన, 2021లో అవార్డు గెలుచుకున్న నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. జపాన్‌లో పెరిగిన చాలామందికి ఈ కథ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, ప్రధాన పాత్రలు పూర్తిగా కొత్తవి కావు.కానీ మనలాంటి బయిట దేశం వాళ్లం ఆ నేపధ్యం తెలుసుకుని, అర్దం చేసుకుని చూడాలి.
“ది సమురాయి అండ్ ది ప్రిజనర్”ను కేవలం మర్డర్ మిస్టరీగా చూస్తే సగం సినిమా మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమా మన రెగ్యులర్ స్క్రీన్‌ప్లే కమర్షియల్ నిర్మాణంలో నడవదు.ఒకే మెయిన్ మిస్టరీని చివరి వరకు లాగకుండా, కథను వేర్వేరు సంఘటనలు, రహస్యాలుగా విభజించారు. ప్రతి కొత్త సంఘటన మొదట ఒక్కో మిస్టరీలా కనిపిస్తుంది. కానీ క్రమంగా అవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయని అర్థమవుతుంది.
ఇక్కడ స్క్రీన్‌ప్లేలో బాగా వర్కవుట్ అయిన ఎలిమెంట్ మురాషిగే–కాన్బే మధ్య రిలేషన్. ఒకరు అధికారంలో ఉన్న వ్యక్తి. మరొకరు ఖైదీ. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారనే సమీకరణ కూడా మారుతుంది. ఒకరు చెప్పే సమాధానాన్ని మరొకరు పూర్తిగా నమ్మరు. ఈ మైండ్ గేమ్ సినిమాకు మంచి బలం.స్క్రీన్‌ప్లే కూడా ఒక రిథమ్‌ను అనుసరిస్తుంది.
కియోషి కురొసావా దర్శకత్వం
హడావుడి లేకుండా టెన్షన్ సృష్టించడం దర్శకుడి ప్రధాన బలం. చిన్న కెమెరా కదలికలు, పాత్రల మధ్య దూరం, నిశ్శబ్దాన్ని ఉపయోగించడం ద్వారా సీన్స్ లో ఒక ప్రత్యేకమైన టెన్షన్ ని తీసుకొచ్చారు.
అయితే… స్లో పేస్ లో సినిమా నడుస్తుంది. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఆశించే ప్రేక్షకులకు ఇది ఓపిక పరీక్ష. అలాగే సినిమా మొత్తం డైలాగులుతో నిండిపోయి ఉంటుంది. కొంచెం ఓపిక కావాలి.
హైలెట్
ఈ సినిమా విజువల్ గా చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ అందంలో ఒక బందీ భావన కూడా ఉంటుంది. కోట మొదట్లో సురక్షితమైన ప్రదేశంలా కనిపిస్తుంది. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ అదే ప్రదేశం జైలులా అనిపించడం సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కలిసి సాధించిన విజయం గా చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిస్టరీకి మరింత బలం ఇచ్చింది.
ఫైనల్ థాట్
సమురాయి సినిమా కాబట్టి భారీ కత్తి యుద్ధాలు ఉంటాయని ఆశించకండి. ఇది శారీరక యుద్ధం కంటే మానసిక యుద్ధంపై ఎక్కువ ఆధారపడిన సినిమా.
ఎక్కడ చూడవచ్చు
ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్స్ లో చూడవచ్చు. ఇండియాలో అఫీషియల్ రిలీజ్ లేదు.








