రూ.7,600 కోట్ల ఐపీవో కోసం సెబీకి అవాదా ఎలెక్ట్రో దరఖాస్తు!
ప్రముఖ సోలార్ ఫోటోవోల్టెయిక్ తయారీ సంస్థ అవాదా ఎలెక్ట్రో లిమిటెడ్ తమ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి అప్డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (యూడీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మొత్తం రూ. 7,600 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఐపీవో వివరాలు నిధుల వినియోగం..
ఈ ప్రతిపాదిత ఐపీవోలో భాగంగా రూ. 1,600 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. అలాగే, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద మరో రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 5గా ఉంది. ఓఎఫ్ఎస్ ద్వారా ప్రమోటర్ సంస్థ అయిన అవాదా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వాటాలను విక్రయించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధుల్లో సుమారు రూ. 1,200 కోట్లను కంపెనీ రుణాల చెల్లింపునకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు.
కంపెనీ నేపథ్యం వ్యాపార విస్తరణ..
చైర్పర్సన్ వినీత్ మిత్తల్ సారథ్యంలోని అవాదా గ్రూప్‌లో భాగమైన అవాదా ఎలెక్ట్రో 2021లో ఏర్పాటయింది. సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీతో ఈ సంస్థ పునరుత్పాదక ఇంధన రంగంలో సేవలు అందిస్తోంది. ‘ఎన్లూమ్’, ‘ఇంటిగ్లో’ బ్రాండ్ల ద్వారా దేశంలోని 13 రాష్ట్రాల్లో 14 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సోలార్ మాడ్యూల్స్‌ను విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో 1.5 గిగావాట్లు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 7 గిగావాట్ల మాడ్యూల్ తయారీ సామర్థ్యం గల ప్లాంట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అలాగే 6 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ ప్లాంట్లలో సగం ఇప్పటికే అందుబాటులో ఉండగా, మిగతా సగం పనులు సెప్టెంబర్ 30 నాటికి పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలో ‘అవాదా హేలో’ పేరిట ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్‌ను కూడా తీసుకొచ్చే ప్రణాళికలో కంపెనీ ఉంది.
ఆర్థిక వృద్ధి గ్లోబల్ ఇన్వెస్టర్లు..
కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 911.62 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం, 2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,303.52 కోట్లకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో నికర లాభం రూ. 173 కోట్ల నుంచి రూ. 888.74 కోట్లకు పెరిగింది. గ్రూప్‌లోని మరో సంస్థ అయిన అవాదా ఎనర్జీ ప్రధాన కస్టమర్‌గా ఉంటూ, 2026 ఆర్థిక సంవత్సరపు ఆదాయంలో దాదాపు 89 శాతం వాటాను కలిగి ఉంది. కాగా, అవాదా గ్రూప్‌లో బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ ట్రాన్సిషన్ ఫండ్-1, గ్లోబల్ పవర్ సినర్జీ కంపెనీ, ఏడీబీ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.








