అంచనాలకు మించిన వృద్ధి.. భారత ఆర్థిక వ్యవస్థపై వైట్ హౌస్ ప్రశంసలు..
భారత్ ఆర్థిక వ్యవస్థ దుమ్మురేపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసిన 7 శాతం కంటే ఇది ఎక్కువ. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానూ భారత్ కొనసాగింది. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం.
2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్‌లో భారత వృద్ధి 6.9 శాతంగా నమోదైంది. ‘2025-26 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.75.46 లక్షల కోట్లుగా ఉన్న వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (స్థిర ధరల వద్ద జీడీపీ), 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.81.36 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 7.8 శాతం వృద్ధి రేటును సూచిస్తోందని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే త్రైమాసికమైన జనవరి- మార్చిలోని 8.6 శాతంతో పోలిస్తే ఏప్రిల్- జూన్‌లో నమోదైన వృద్ధి తక్కువే కావడం గమనార్హం.
2026-27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును 6.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్‌లో నామినల్ జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీని రూ.88.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2025-26 మొదటి త్రైమాసికంలోని రూ.80 లక్షల కోట్లతో పోలిస్తే 10.3 శాతం ఎక్కువ.
భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించడాన్ని ఒక అసాధారణ ఘనతగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని ప్రశ్నిస్తున్న వారిపై ఆయన స్పందిస్తూ ‘భారత్ ప్రగతి బాటలో మళ్లీ వికసించింది. ఈ గణాంకాలు విమర్శకుల నోళ్లూ మూయించాయ’ని అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేయడంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రశంసలు కురిపించింది. తాజాగా వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం వృద్ధి సాధించిన నేపథ్యంలో వైట్‌హౌస్ సానుకూలంగా స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్రియాశీలకంగా, దృఢంగా, స్థితిస్థాపకతతో ఉందని వైట్‌హౌస్ సీనియర్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్ కొనియాడారు.
నార్త్ కరోలినాలో జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్‌పై ట్రంప్ ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని ఈ జీడీపీ గణాంకాలు మరింత బలపరిచాయని ఆయన పేర్కొన్నారు. ఇది అమెరికా ప్రభుత్వానికి, అక్కడి కార్పొరేట్ సంస్థలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే పరిణామమని అభిప్రాయపడ్డారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని, అదే సమయంలో అమెరికాలోనూ భారతీయ పెట్టుబడులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆయన వివరించారు.








