ఫేస్ బుక్, ఇన్ స్టా యాప్స్ లో భారీ మార్పులు.. సంస్కరణల బాటలో మెటా..!
టెక్ దిగ్గజం మెటా దిగొచ్చింది. కోర్టు కేసుల నుంచి విముక్తిపొందేందుకు అమెరికాలోని 48 రాష్ట్రాలతో రాజీ కుదుర్చుకుని, వచ్చే పదేళ్ల కాలంలో సుమారు రూ.1.71 లక్షల కోట్లు (1800 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు అంగీకరించింది. దీనికితోడు భవిష్యత్తులో ఇబ్బందులు , న్యాయవివాదాలు తలెత్తకుండా.. తన ‘ఫేస్బుక్’, ‘ఇన్స్టాగ్రామ్’ యాప్‌లకు భారీ మార్పులు చేపట్టనుంది. సామాజిక మాధ్యమ వేదికలకు చిన్నారులు బానిసలు, వ్యసనపరులయ్యేలా చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇకపై 18ఏళ్ల లోపు చిన్నారులకు రోజుకు రెండు గంటల పాటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్‌లు అందుబాటులో ఉండేలా పలు నియంత్రణలను తీసుకువస్తామని మెటా తెలిపింది.‘లైక్’ల సంఖ్యను తొలగిస్తుంది. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించుకోవడానికి వీల్లేకుండా ఈ యాప్‌లను బ్లాక్ చేయనుంది.
పదమూడేళ్లలోపు చిన్నారులకు ఈ వేదికలలో ఖాతాల ప్రారంభాన్ని అనుమతించబోమని పేర్కొంది. వీటితో పాటు మరిన్ని భద్రతా చర్యలు కూడా తీసుకుంటామని మెటా వెల్లడించింది. యాప్‌లను వినియోగించే వారి వయసును నిర్ధారించుకోవడానికి, నియంత్రణలను పాటించేందుకు కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తామంటూ కేసుల పరిష్కారంలో భాగంగా హామీ ఇచ్చింది








