‘టాక్సిక్’ రివ్యూలపై వివాదం,యూట్యూబర్లకు నిర్మాతలు నోటిసులు!
–సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమా చూసొచ్చి “ఏముంది బాసూ, బోర్ కొట్టించేసింది” అని ఫ్రెండ్ దగ్గరో, సోషల్ మీడియాలోనో చెప్పుకోవడం మనందరికీ అలవాటే. కానీ, అదే మాట ఓ యూట్యూబ్ వీడియోలోనో, ఆన్లైన్ రివ్యూలోనో చెబితే లీగల్ నోటీసులు వస్తాయంటే ఎవరికైనా ఉలికిపాటు కలగడం సహజం. ఇప్పుడు యష్ లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది.
ఆగస్టు 26న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘టాక్సిక్’ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. సినిమా నచ్చనివాళ్లు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో టికెట్ బుకింగ్ యాప్స్‌లో రేటింగ్స్ మాయం అవ్వటం షాక్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు యూట్యూబర్లకు లీగల్ నోటీసులు అందడం..విషయాన్ని వివాదంగా మార్చింది. సూరజ్ కుమార్, ప్రశాంత్ రంగస్వామి లాంటి ప్రముఖ యూట్యూబర్లకు నిర్మాతల తరఫున నోటీసులు అందడంతో సోషల్ మీడియాలో రచ్చ మరింత ముదిరింది.
నిర్మాతలు వందల కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు, కావాలని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని అడ్డుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. కోర్టు కూడా “సినిమా గురించి పూర్తిగా రాయొద్దు” అని చెప్పలేదు. కేవలం తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌పైనే ఆంక్షలు పెట్టింది.
అయితే అసలు చిక్కల్లా అక్కడే ఉంది. “సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు” అనడానికి, “ఈ సినిమాలో ఇబ్బందికరమైన విషయాలున్నాయి” అని నిరాధారంగా మాట్లాడడానికి మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వ్యక్తిగత అభిప్రాయానికి, పరువు నష్టానికి మధ్య లైన్ ఎక్కడ గీయాలి?
ప్రస్తుతానికైతే బెంగళూరు కోర్టులో సెప్టెంబర్ 28న జరిగే తదుపరి విచారణపైనే అందరి చూపూ ఉంది. అక్కడ వచ్చే తీర్పు కేవలం ‘టాక్సిక్’ సినిమా భవిష్యత్తును మాత్రమే కాదు.. రేపు పొద్దున సినిమా బాగోలేదని బాహాటంగా చెప్పే ప్రతి సాధారణ ప్రేక్షకుడి గొంతును, సోషల్ మీడియా రివ్యూవర్ల స్వేచ్ఛను కూడా డిసైడ్ చేయబోతోంది!








