రాత్రి 12 తర్వాత Instagram బంద్!? భారత్ లో కూడానా?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి పన్నెండు గంటలవుతోంది. ఒక కుర్రాడు నిద్రపోవాల్సింది పోయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. ఒక వీడియో చూస్తాడు, వెంటనే ఇంకోటి వస్తుంది. ఇంతలో ఫోన్ లో చిన్న శబ్దం వస్తుంది. మరో వీడియోకు చెందిన నోటిఫికేషన్ చూస్తాడు.
“ఇంకొక్కటి చూసి పడుకుంటా” అనుకుంటాడు. కానీ మరో గంట గడిచిపోతుంది. ఉదయం స్కూల్‌కి లేవాలి, కళ్లు మంట పుడుతున్నా ఆ స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోలేడు. అయితే ఇప్పుడా పరిస్ధితి మారేలా కనపడుతోంది.
రాత్రి 12 దాటాక పిల్లలు Instagram ఓపెన్ చేయబోతే యాప్ లోపలికి అనుమతించదు. ఉదయం 6 వరకు నో ఎంట్రీ! ఇది ఏదో భవిష్యత్తులో రావచ్చని చెబుతున్న ప్రతిపాదన కాదు. Meta కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో 18 ఏళ్లలోపు టీనేజర్ల కోసం అమెరికాలో ఈ “Night Mode”ను డిఫాల్ట్‌గా అమలు చేయబోతోంది.
Instagram, Facebook రెండింటిపైనా ఇది వర్తిస్తుంది. అయితే తల్లిదండ్రుల అనుమతితో ఆ పరిమితిని మార్చుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో మాత్రమేనా? భారత్‌లో కూడా ఇలాంటి రూల్ వస్తుందా? అసలు Meta ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? పిల్లలపై ఇంత ప్రేమ ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
మొదట కోర్టుకు వెళ్లింది 29 రాష్ట్రాలు..
2023లో అమెరికాలోని 29 రాష్ట్రాలు Metaపై కేసు వేశాయి. ఆరోపణ ఏమిటంటే.. Facebook, Instagram వంటి ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా, ఎక్కువసేపు వాటిలోనే ఉండేలా పనిచేస్తున్నాయని. అంతేకాదు, పిల్లల గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను కంపెనీ ఉల్లంఘించిందని రాష్ట్రాలు ఆరోపించాయి.
రాష్ట్రాల వాదనలో ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. Metaకి చాలా చిన్న వయసు పిల్లలు తన ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారని తెలుసు. అయినా వారిని అడ్డుకునేందుకు సరిపడా చర్యలు తీసుకోలేదని వారు కోర్టులో వాదించారు.
ఈ కేసు కేవలం బయటివాళ్ల ఆరోపణలతోనే నడవలేదు. కోర్టులో సమర్పించిన లక్షలాది అంతర్గత పత్రాలు కథను మరో మలుపు తిప్పాయి.
అసలేం జరిగింది
ఎందుకిలా పిల్లలు చేస్తున్నారు అంటే ..వాళ్లు సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యిపోయారు. అయ్యేలా చేసిందెవరు..అంటే కంపెనీనే అని తేలింది. దీని వెనక పెద్ద బిజినెస్, పిల్లలు బలైనా ఫరవాలేదు, మనకు ప్రకటనలు రావాలనే ఆలోచన ఉంది. అయితే ఈ బిజినెస్ వెనుక చాలా పెద్ద డ్రామా నడుస్తోంది.
ఈ విషయం మార్క్ జుకర్‌బర్గ్ కు తెలియదా?
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిల్లాడిని రాత్రంతా అలా ఫోన్లో కూరుకుపోయేలా చేసే టెక్నాలజీ ఆ మార్క్ జుకర్‌బర్గ్ గారి Meta కంపెనీ దగ్గర పక్కాగా ఉంది. రాత్రిపూట నోటిఫికేషన్లు ఆపేయొచ్చు, టైమ్ల్ లిమిట్ పెట్టొచ్చు, ఎక్కువసేపు చూస్తే వార్నింగ్ ఇవ్వొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు ఆ పని ఎందుకు చేయలేదు? సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు అమెరికాలో కోర్టులు అడుగుతూంటే… ఆ కంపెనీని ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల వల్ల పిల్లల మనసులు, ఆరోగ్యాలు ఎలా పాడవుతున్నాయో తేల్చేందుకు అమెరికాలోని ఏకంగా 48 రాష్ట్రాలు కలిసి రంగంలోకి దిగాయి. విచారణలో భాగంగా Meta ఏకంగా 18 బిలియన్ డాలర్లు (₹1.72 లక్షల కోట్లు) చెల్లించేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది! ఈ భారీ మొత్తాన్ని రాబోయే పదేళ్లలో విడతలవారీగా చెల్లిస్తారట.
ఇప్పుడేం చేస్తారు
డబ్బు సంగతి సరే, అసలు పంచాయతీ ఇక్కడే మొదలైంది. ఇకపై టీనేజర్ల కోసం ఆ యాప్‌లను పూర్తిగా మార్చాల్సి వస్తోంది. రోజుకి రెండు గంటలు దాటితే ఫోన్ పనిచేయదు. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అసలు నోటిఫికేషన్లు రావు. స్కూలు వేళల్లో కూడా నోటిఫికేషన్లు మోగవు. వరుసగా పదిహేను నిమిషాలు సోషల్ మీడియాని చూడగానే “ఒకసారి బ్రేక్ తీసుకో” అని హెచ్చరిక వస్తుంది. వీడియోలు అవే కంటిన్యూగా ప్లే అయిపోకుండా ఆపొచ్చు.
అన్నీ ముందే తెలుసు
ఇన్ని మంచి ఫీచర్లు రెడీ చేయటానికి వాళ్లకు ఏడేళ్ల క్రితమే ఆలోచన రాలేదా? ఇక్కడే అసలు బాంబు పేలింది. పిల్లలు ఈ యాప్‌లకు ఎలా బానిసలైపోతున్నారో కంపెనీకి చాలా ముందే తెలుసని బయిటపడింది.
Metaలో పనిచేసిన మాజీ పరిశోధకుడు జార్జ్ వోలిచెంకో కోర్టులో మాట్లాడుతూ.. టీనేజర్ల రాత్రి వినియోగాన్ని తగ్గించేందుకు “Quiet Mode” అనే ఫీచర్‌పై తన టీమ్ పనిచేసిందని చెప్పారు.
ఈ ఫీచర్ రాత్రి సమయంలో నోటిఫికేషన్లను మ్యూట్ చేస్తుంది. అంతేకాదు.. దాన్ని డిఫాల్ట్‌గా ఆన్ చేస్తే ఎక్కువ మంది టీనేజర్లు ఉపయోగిస్తారని తమ టీమ్‌కు ముందే తెలుసని ఆయన చెప్పారు. అయితే ఆ ఫీచర్‌ను విస్తృతంగా అమలు చేయడంలో తమకు తగినంత స్వేచ్ఛ లేదని ఆయన వాదించారు.
“Quiet Mode” ని కావాలని వదిలేశారు. ఎందుకంటే? రేపు ఎవరైనా కోర్టుకి లాగితే “మేము ముందే జాగ్రత్తపడ్డాం” అని చెప్పుకోవడానికి ‘క్వైట్ మోడ్’లాంటివాటిని ఒక కవచలా వాడారట! అసలు విషయం బయటపడేసరికి అందరూ షాక్ తిన్నారు.
ఎందుకిలా చేసింది
ఇదంతా ఎందుకు మెటా చేస్తోందో ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. పిల్లలు ఎంత ఎక్కువ సేపు రీల్స్ చూస్తే, కంపెనీకి అంత ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ప్రకటనలు వస్తే కాసుల వర్షం కురుస్తుంది. సో.. పిల్లలు ఫోన్ పక్కన పెట్టేస్తే కంపెనీకి వచ్చే లాభాలు ఆగిపోతాయి కదా! అందుకే ఇన్నాళ్లూ నడవనిద్దాం. సమస్య వస్తే చూసుకుందాం అన్నట్లు ముందుకు పోనిచ్చారు.
ఇప్పుడు అమెరికా కోర్టులు ఆ కంపెనీల భరతం పడుతున్నాయి. “మా ప్లాట్‌ఫారమ్‌ను సేఫ్‌గా మారుస్తున్నాం” అని మాటలు చెబితే సరిపోదు, చేతల్లో చూపించాలని తేల్చిచెప్పాయి.
మరి భారత్‌లో Instagram రాత్రి 12కి బంద్ అవుతుందా?
ప్రస్తుత సెటిల్మెంట్ ప్రకారం కాదు. ఇది అమెరికా రాష్ట్రాలతో Meta చేసుకున్న ఒప్పందం. కాబట్టి దీనిని చూసి “ఇకపై ప్రపంచవ్యాప్తంగా Instagram రాత్రి 12కి బంద్” అని అనుకోవడం తప్పు. ఇండియాలో కూడా ఎవరైనా కేసు వస్తే జరిగే అవకాసం ఉంది.
ఫైనల్ గా…
ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఇన్స్టాగ్రామ్ కట్టడి చేస్తే సరిపోదు, పిల్లలు పక్కనే ఉన్న టిక్‌టాక్ లోకో, యూట్యూబ్ లోకో దూకేస్తారు. అందుకే ఈ నిబంధనలు ఒక్క Metaకే కాదు, అన్ని సోషల్ మీడియా కంపెనీలకూ వర్తిస్తేనే అసలైన మార్పు వస్తుంది.
ఇన్నాళ్లూ “ఎవరు ఎక్కువ మందిని ఫోన్‌కి అతుక్కునేలా చేస్తారు?” అనేదానిపైనే కంపెనీల మధ్య పోటీ ఉండేది. కానీ ఇకపై “పిల్లలను సురక్షితంగా ఉంచుతూ ఎవరు యాప్ నడపగలరు?” అనే సరికొత్త పోటీ మొదలుకాబోతోంది. పిల్లల సమయాన్ని అమ్ముకునే ఈ బిజినెస్‌లో ఇకపై వారి భద్రతకు కూడా జవాబు చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. చూద్దాం..మార్పు ఏ స్దాయిలో వస్తుందో?








