వరద ప్రభావిత ప్రాంతాల్లో బాలెన్ షా పర్యటన..!
నేపాల్ ప్రధాని బాలెన్ షా.. అత్యంత ప్రజాదరణతో గద్దెనెక్కిన ఈ జననేత.. ఇప్పుడు అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే యువత నిరసనలతో పుట్టెడు సమస్యల్లో ఉన్న ఆయనకు, తాజాగా దేశంలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను సవాల్‌గా, ఆయన నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలలకే ఇంతటి తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కోవాల్సి రావడం ఆయన కష్టాల్ని రెట్టింపు చేసింది.
టిబెట్ సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లో సంభవించిన ఈ జల ప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్తు వందలాది ప్రాణాలను బలిగొంది. మరో 1,600 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో మానసరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 300 మంది భారత యాత్రికులు కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ విపత్తు నేపథ్యంలో ప్రధాని బాలేన్ షా వెంటనే రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతమైన నువాకోట్‌లో స్వయంగా పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ సమీకరిస్తున్నామని, జాతీయ ఏజెన్సీలు, ఎన్జీవోలు, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి తక్షణ సాయం అందిస్తున్నామని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు.
విదేశీ పర్యాటకుల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేపాల్ విదేశాంగమంత్రి ఖనాల్ స్పష్టం చేశారు. నేపాల్ పౌరులతో సమానంగా విదేశీయుల క్షేమాన్ని కూడా చూసుకుంటామని, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని హామీ ఇచ్చారు. సత్వరమే సహాయం అందించినందుకు భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఒకవైపు ప్రకృతి విపత్తు సృష్టించిన విధ్వంసం, మరోవైపు తన కార్యాచరణ ఆధారిత పాలనను నిరూపించుకోవాలన్న ప్రధాని తపన.. ఈ రెండూ బాలేన్ షా తొలి నాళ్ల నాయకత్వాన్ని నిర్వచిస్తున్నాయి. ఈ కఠిన సమయంలో ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.








