దుల్కర్ ‘I’m Game’ స్టోరీ లీక్… హాలీవుడ్లో వచ్చిన పాత కథేనా?
—-సూర్య ప్రకాష్ జోశ్యుల
అదేంటో కానీ… సినిమా వాళ్ళు ఎంత సీక్రెట్ గా ఉంచాలని ట్రై చేస్తే, అంతలా ఏదో ఒక మూల నుంచి లీకులు బయటకు వచ్చేస్తూనే ఉంటాయి! దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా ‘I’m Game’ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రమోషన్లలో అసలు మేటర్ రివీల్ చేయలేదు, ట్రైలర్లోనూ కేవలం ఒక ఫాంటసీ ఎలిమెంట్ ఉందంటూ ఊరించారంతే. కానీ ఫైనల్‌గా అసలు స్టోరీ సీక్రెట్ ఎక్కడ లీకైందో తెలుసా? మనం రోజూ వాడే టికెట్ బుకింగ్ యాప్‌లోని చిన్న సినాప్సిస్లో!
అక్కడితో ఆగితే బాగుండేది, ఆ పాయింట్ బయటకు రాగానే మన సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? వెంటనే పాత హాలీవుడ్ లనీ తిరగేయడం మొదలుపెట్టేశారు. “అరే… ఈ పాయింట్ ఎక్కడో చూసినట్టుందే!” అంటూ 1991లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘Body Parts’ను తెరపైకి తెచ్చారు. మరి దుల్కర్ సినిమా కథ నిజంగానే కాపీనా? లేక పాత కాన్సెప్ట్‌కే కొత్త కలరింగ్ ఇచ్చారా? అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం!
బుకింగ్ యాప్ ఇచ్చిన చిన్న ట్విస్ట్!
నహాస్ హిదాయత్ డైరెక్షన్ అనగానే ‘RDX’ మ్యాజిక్ అందరి కళ్ల ముందు కదులుతుంది. దాంతో ‘I’m Game’ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. దుల్కర్ కూడా ట్రైలర్ లాంచ్‌లో “దీంట్లో ఒక చిన్న ఫాంటసీ ట్విస్ట్ ఉంది, అదేంటో థియేటర్లకొచ్చి చూడండి” అని హింట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు.
మన మనవాళ్లు ఊరుకుంటారా? ట్రైలర్‌లోని ప్రతీ ఫ్రేమ్‌ను జల్లెడ పట్టి రకరకాల థియరీలు క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఈ క్యూరియాసిటీ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో… బుకింగ్ ప్లాట్ఫామ్లో అప్డేట్ చేసిన ఒక చిన్న సినాప్సిస్ మొత్తం కథను బట్టబయలు చేసేసింది.
అసలు ఆ ‘I’m Game’ కథేంటి?
బయటకు వచ్చిన ఆ లైన్ ప్రకారం చూస్తే… సినిమాలో హీరోకి ఒక యాక్సిడెంట్ జరిగి చేయి పోతుంది. డాక్టర్లు ఇంకెవరిదో ఒకరి చేయిని అతనికి అమరుస్తారు (Hand Transplant).
ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సినిమా ఇక్కడే మొదలవుతుంది! ఆ కొత్త చేయి సాధారణమైనది కాదట. దానికి ఒక గతం ఉందట. సరిగ్గా ఆ చేయి ఎవరిదైతే ఉందో, వారి మరణం చాలా సాధారణమైనది కాదట. ఇప్పుడు ఆ చేయి తన పాత యజమాని చావుకు కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందట!
అంటే ఆలోచించండి… ఒక మనిషి చేతికి అమర్చిన మరొకరి చేయి, తన సొంత లెక్కలు సెటిల్ చేసుకోవడానికి బయలుదేరిందన్నమాట! ఈ పాయింట్ బయటకు రాగానే అందరి గురి ఒకే ఒక్క పాత హాలీవుడ్ సినిమా వైపు వెళ్ళింది.
“అరే… ఇది అచ్చం ‘Body Parts’ లాగే ఉందే!”
కరెక్ట్ గా గుర్తుపట్టారు! 1991లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘Body Parts’ కథ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే చేయి పోతుంది, వేరే వాళ్ళ చేయి అమరుస్తారు. ఆ తర్వాత ఆ చేయి అతని మాట వినకుండా, దానికి నచ్చినట్టు హింసాత్మకంగా ప్రవర్తిస్తుంది. ఆఖరికి ఆ చేయి గతంలో ఒక సీరియల్ కిల్లర్‌ది అని తెలుసుకున్నప్పుడు హీరోకి దిమ్మతిరిగిపోతుంది.
ఇప్పుడు ‘I’m Game’ కూడా అదే లైన్లో ఉందని అనడానికి కారణం అదే. కాకపోతే, ఆ హాలీవుడ్ సినిమాలో ఆ చేయి కేవలం వైలెంట్‌గా మారుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక అడుగు ముందుకేసి, “నా చావుకు కారణమైన వాళ్ళను నువ్వు చంపాల్సిందే” అన్నట్టుగా పాత యజమాని పగను ఆ చేయి తీర్చుకోవాలని చూస్తోంది. కాన్సెప్ట్ ఒకటే అయినా, ట్రీట్మెంట్ పరంగా వేరేలా ఉండేలా కనిపిస్తోంది.
ఈ ‘చేయి కథలు’ నిన్న మొన్నటివి కావు!
ఇక్కడో సరదా అయిన మేటర్ చెప్పుకోవాలి. ‘Body Parts’ సినిమానే ఈ కాన్సెప్ట్‌కు మొదటిది అనుకుంటే పొరపాటే! ఈ ఆలోచనకు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది.
వెనక్కి వెళ్ళి చూస్తే, 1924లోనే ‘The Hands of Orlac’ అనే సినిమా వచ్చింది. అందులో ఒక పియానిస్ట్ తన చేతులు పోగొట్టుకుంటే, ఒక హంతకుడి చేతులను అతనికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఆ తర్వాత ఆ చేతులు ఇతని ప్రాణాలను, మనసును ఎలా శాసించాయనేదే ఆ సినిమా కథ.
అంటే… హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్, ఆ చేతికి ఉండే ఏదో ఒక విచిత్రమైన శక్తి… ఇవి సినిమా ప్రపంచానికి కొత్తేం కాదు. దశాబ్దాలుగా ఎన్నోసార్లు తెరపైకి వచ్చిన పాయింటే!
పాత కాన్సెప్టే కదా అని తీసిపారేయగలమా?
ఇక్కడే మనమంరం ఓ చిన్న లాజిక్ మిస్ అవుతుంటాం. సినిమా కథలని లోతుగా వెళ్లి వెతికితే ప్రపంచంలో కొత్తగా మిగిలింది ఏముంటుంది? అన్నీ ఇప్పటికే వచ్చేసిన పాత కాన్సెప్ట్‌లే! ప్రేమ కథలు, రివెంజ్ డ్రామాలు, పునర్జన్మలు… అన్నీ ఎప్పుడో ఎవరో ఒకరు తీసినవే. కాకపోతే కొత్త ట్రీట్మెంట్ లు. ఈ కాలం అడాప్షన్ లు.
అంటే క్రిటిక్స్ లేదా ఆడియన్స్ చూసేది పాయింట్ పాతదా కాదా అని కాదు… ఆ పాయింట్‌ను ఇప్పుడున్న జనరేషన్‌కు తగ్గట్టు ఎంత ఇంట్రెస్టింగ్గా మలిచారు? డైరెక్టర్ మేకింగ్ ఎలా ఉంది? అనేదే అసలైన విన్నింగ్ పాయింట్. నహాస్ హిదాయత్ మేకింగ్ స్టైల్ వేరు. కాబట్టి కాన్సెప్ట్ పాతదైనా, దీన్ని ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యారా లేదా అనేదే ఇక్కడ మ్యాటర్.
లీక్ వల్ల సినిమాకి నష్టమా… లాభమా?
నిజానికి సినిమా టీమ్ చాలా కష్టపడి ఈ సీక్రెట్‌ను దాచాలని చూసింది. థియేటర్లో ఆ సర్ప్రైజ్ చూస్తే కిక్కు వేరేలా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇలా ముందుగానే లీక్ కావడం వల్ల ఒకరకంగా మైండ్ గేమ్‌లా మారిపోయింది.
“అరే, చేయి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది?” అనే క్యూరియాసిటీ ఇప్పుడు జనాల్లో బాగా పెరిగింది. ప్రమోషన్స్ చేయాల్సిన హడావుడిని ఈ లీక్‌లే చేసేస్తున్నాయి! సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసేలా ఈ డిస్కషన్స్ ఉపయోగపడుతున్నాయి.
మొత్తానికి చూస్తే…
కాన్సెప్ట్ పాతదైనా, దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైరెక్టర్ టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలి. ఆ చేయి ఎవరి కోసం వెతుకుతోంది? అసలు ఆ రహస్యం ఏంటి? వీటన్నింటికీ అసలైన సమాధానం ఒక్కటే చోట దొరుకుతుంది. అది రిలీజ్ రోజు ..అంటే సెప్టెంబర్ 3 న తెరమీద.








